Hanuma Vihari Injury: హ్యాట్సాఫ్ విహారి.. మణికట్టు విరిగినా ఒంటి చేత్తో బ్యాటింగ్
Hanuma Vihari Injury: హ్యాట్సాఫ్ విహారి అనకుండా ఉండలేము. తన మణికట్టు విరిగినా ఒంటిచేత్తో అతడు అలాగే బ్యాటింగ్ చేయడం విశేషం. రైట్ హ్యాండర్ అయిన విహారి.. గాయం కారణంగా లెఫ్ట్ హ్యాండర్ గా మారిపోయాడు.
Hanuma Vihari Injury: ఆంధ్రా టీమ్ కెప్టెన్ హనుమ విహారి పట్టుదల ఎలాంటిదో మనం గత ఆస్ట్రేలియా పర్యటనలో చూశాం. ఆసీస్ పేసర్లకు తన శరీరాన్నే అడ్డుపెట్టి ఇండియన్ టీమ్ ను ఆదుకున్న తీరు ఎవరూ అంత త్వరగా మరచిపోరు. ఇప్పుడు విహారి తనలోని కమిట్‌మెంట్ ఎలాంటిదో మరోసారి నిరూపించాడు. రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో తన మణికట్టు విరిగినా అతడు బ్యాటింగ్ కు దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
మధ్యప్రదేశ్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో రోజు బుధవారం (ఫిబ్రవరి 1) 9వ వికెట్ పడిన తర్వాత విహారి బ్యాటింగ్ కు దిగడం చూసి అందరూ నోరెళ్లబెట్టారు. ఎందుకంటే అంతకుముందు తొలి రోజే ఎంపీ బౌలర్ అవేష్ ఖాన్ బౌలింగ్ లో విహారి గాయపడ్డాడు. తర్వాత స్కాన్స్ లో మణికట్టు విరిగినట్లు తేలింది. అప్పటికే విహారి 16 పరుగులతో ఉన్నాడు.
ఇక రెండో రోజు టీమ్ 9వ వికెట్ పడిన తర్వాత అతడు మరోసారి క్రీజులోకి వచ్చాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన విహారి.. లెఫ్టాండ్ తో బ్యాటింగ్ చేశాడు. కేవలం తన కుడిచేతిని మాత్రమే వాడుతూ బౌలర్లను అడ్డుకున్నాడు. అంతేకాదు ఆ ఒంటిచేత్తోనే అవేష్ ఖాన్ బౌలింగ్ లోనే ఓ ఫోర్ కూడా కొట్టడం విశేషం. తన స్కోరుకు మరో 11 పరుగులు జోడించి 27 రన్స్ దగ్గర చివరి వికెట్ గా వెనుదిరిగాడు.
అయితే అంత గాయంతోనూ అతడు ఆడిన తీరు చాలా మందిని ఆకట్టుకుంది. ఆంధ్రా టీమ్ తరఫున రిక్కీ భుయి, కరణ్ షిండే సెంచరీలు చేయడంతో ఆ టీమ్ తొలి ఇన్నింగ్స్ లో 379 రన్స్ కు ఆలౌటైంది. గతేడాది వరకూ ఇండియన్ టెస్ట్ టీమ్ లో రెగ్యులర్ మెంబర్ గా ఉన్న విహారి.. శ్రేయర్ అయ్యర్ రాకతో క్రమంగా చోటు కోల్పోయాడు. వచ్చే ఆస్ట్రేలియా సిరీస్ కు కూడా అతనికి జట్టులో చోటు దక్కలేదు.
తాజాగా గాయంతోనూ అతడు బ్యాటింగ్ చేసిన తీరు చూసి నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒంటిచేత్తో అతడు ఆడిన వీడియో వైరల్ గా మారింది. అసలు ధైర్యం అంటే విహారిదే అంటూ అతన్ని ఆకాశానికెత్తుతున్నారు.
సంబంధిత కథనం