David Miller | రాజస్థాన్ జట్టుకు క్షమాపణలు చెప్పిన మిల్లర్.. ఎందుకంటే?-gujarat titans hero david miller says sorry to rajasthan team after the match ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  David Miller | రాజస్థాన్ జట్టుకు క్షమాపణలు చెప్పిన మిల్లర్.. ఎందుకంటే?

David Miller | రాజస్థాన్ జట్టుకు క్షమాపణలు చెప్పిన మిల్లర్.. ఎందుకంటే?

Maragani Govardhan HT Telugu
May 25, 2022 01:03 PM IST

గుజరాత్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్.. రాజస్థాన్‌తో మ్యాచ్ అనంతరం ప్రత్యర్థి జట్టుకు క్షమాపణలు చెప్పాడు. ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్సర్లతో రెచ్చిపోయి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు మిల్లర్.

డేవిడ్ మిల్లర్
డేవిడ్ మిల్లర్ (PTI)

గుజరాత్ టైటాన్స్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టిన వేళ.. ఆ జట్టు ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో మిల్లర్ చివరి ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అప్పటి వరకు గెలుపుపై ధీమాగా ఉన్న రాజస్థాన్‌కు మిల్లర్ ధాటికి ఆశలు వదులుకుంది. ప్రసిధ్ కృష్ణ వేసిన చివరి ఓవర్‌లో మ్యాచ్ మలుపు తిరగడమే కాకుండా అరంగేట్ర సీజన్‌లోనే ఫైనల్‌కు చేరిన మూడో జట్టుగా గుజరాత్ టైటాన్స్ రికార్డు సృష్టించింది. 68 పరుగులతో అదరగొట్టిన డేవిడ్ మిల్లర్ మ్యాచ్ అనంతరం.. రాజస్థాన్ జట్టును ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశాడు.

సారీ రాయల్స్ ఫ్యామిలీ అని పేర్కొంటూ రాజస్థాన్ ఫ్రాంచైజీకి క్షమాపణలు చెప్పాడు. అంతకుముందు రాజస్థాన్ జట్టు.. మిల్లర్‌ ప్రదర్శనను కొనియాడుతూ ట్వీట్ చేసింది.

గత రెండు సీజన్లలో(2020, 2021) మిల్లర్ రాజస్థాన్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. అయితే అప్పుడు పెద్దగా ఆక్టటుకోని మిల్లర్‌ను ఆ జట్టు వదులుకుంది. దీంతో ఈ ఏడాది జరిగిన మెగా వేలంలో గుజరాత్ జట్టు రూ.3 కోట్లకు కైవసం చేసుకుంది. అయితే ఈ సీజన్‌లో మాత్రం డేవిడ్ మిల్లర్ దుమ్మురేపుతున్నాడు. ఈ సీజన్‌లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసిన మిల్లర్.. సగటున 140 స్ట్రైక్ రేటుతో 449 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో ఆరో స్థానంలో నిలిచాడు.

గుజరాత్-రాజస్థాన్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో రెండు జట్లలో రషీద్ ఖాన్, జాస్ బట్లర్ అదిరిపోయే ప్రదర్శన చేశారు. గుజరాత్ స్పిన్నర్ రషీద్.. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 15 పరుగులే ఇవ్వగా.. రాజస్థాన్ ఓపెనర్ జాస్ బట్లర్ 89 పరుగులతో విధ్వసమే సృష్టించాడు.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ మరో మూడు బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే నష్టపోయి ఛేదించింది. మిల్లర్ 38 బంతుల్లో 68 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్య 40 పరుగులతో బాధ్యతయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, ఓబెడ్ మెకాయ్ చెరో వికెట్ తీశారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్