T20 World Cup: వరల్డ్‌కప్‌కు టీమిండియా పేస్‌ బౌలర్లు వీళ్లే!-former fielding coach sridhar picks up his top 3 pace bowlers for t20 world cup ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  T20 World Cup: వరల్డ్‌కప్‌కు టీమిండియా పేస్‌ బౌలర్లు వీళ్లే!

T20 World Cup: వరల్డ్‌కప్‌కు టీమిండియా పేస్‌ బౌలర్లు వీళ్లే!

Hari Prasad S HT Telugu
Aug 05, 2022 02:18 PM IST

T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌ కోసం టీమిండియాలో గట్టి పోటీయే ఉంది. ముఖ్యంగా వికెట్ కీపింగ్‌, పేస్‌ బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో ఎవరిని తీసుకోవాలి, ఎవరిని వదిలేయాలి అన్నది సెలక్టర్లకు సమస్యగా మారింది.

పేస్ బౌలర్ బుమ్రా
పేస్ బౌలర్ బుమ్రా (AFP)

న్యూఢిల్లీ: ఓవైపు టీ20 వరల్డ్‌కప్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీమిండియా వరుస టీ20 సిరీస్‌లు ఆడుతూ వెళ్తోంది. ఆ మ్యాచ్‌లలో ప్రయోగాలు చేస్తూ అందుబాటులో ఉన్న అందరు ప్లేయర్స్‌ను పరీక్షిస్తోంది. పేస్‌ బౌలింగ్‌, ఓపెనర్లు, వికెట్‌ కీపర్లను మార్చి మార్చి చూస్తోంది. మరోవైపు టీమ్‌లో ఎవరు ఉండబోతున్నారన్న దానిపై మాజీ ప్లేయర్స్‌ అంచనాలు నడుస్తున్నాయి.

తాజాగా టీమిండియా మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ అయితే వరల్డ్‌కప్‌ తుది జట్టులో ఉండబోయే టాప్‌ 3 పేస్‌ బౌలర్లను ఎంపిక చేశాడు. గతేడాది యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత ఇప్పటి వరకూ ఇండియన్‌ టీమ్‌కు 11 మంది పేస్‌ బౌలర్లు ఆడారు. ఈ ఏడాది ఐపీఎల్‌ తర్వాత ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌సింగ్‌లాంటి వాళ్లు కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.

ఇప్పుడు శ్రీధర్‌ వీళ్లలో ముగ్గురు టాప్‌ బౌలర్లను ఎంపిక చేశాడు. తన అంచనా ప్రకారం వరల్డ్‌కప్‌ తుది జట్టులో బుమ్రా, షమి, భువనేశ్వర్‌ ఉంటారని చెప్పాడు. భువనేశ్వర్‌ కొత్త, బాత బంతితోనూ మాయ చేయగలడని, బుమ్రా మిడిల్‌ ఓవర్లలో రన్స్‌ కట్టడి చేయడంతోపాటు డెత్‌ ఓవర్లలో కంట్రోల్‌ చేస్తాడని అన్నాడు. ఇక షమి కొత్త బంతితో ప్రత్యర్థులకు చుక్కలు చూపించగలడని అభిప్రాయపడ్డాడు.

"ఇప్పుడు మరీ ఎక్కువ మంది ఉండటమే సమస్య. నిజమే కదా? అందుకే నేరుగా పాయింట్‌కు వచ్చేస్తాను. ఇండియాకు టాప్‌ 3 బౌలర్లుగా బుమ్రా, షమి, భువీ ఉంటారు. వీళ్లు ముగ్గురూ ఉంటే టీమ్‌కు తిరుగుండదు. ఎలాగూ హార్దిక్‌, జడేజా ఉన్నారు. వీళ్లతో మన ఐదు, ఆరు బౌలర్లు సిద్ధంగా ఉంటారు. వరల్డ్‌కప్‌లాంటి టోర్నీల్లో సీనియర్‌ ప్లేయర్సే ఉండాలి. ఈ ముగ్గురికీ తోడు హార్దిక్‌ ఉంటాడు" అని శ్రీధర్‌ స్పష్టం చేశాడు.

ఈ మధ్య కాలంలో ఇండియాకు భువనేశ్వర్‌ ప్రధాన బౌలర్‌గా ఎదిగాడు. అతడు 18 మ్యాచ్‌లలో కేవలం 6.94 ఎకానమీతోపాటు 23 వికెట్లు తీశాడు. హర్షల్‌ పటేల్‌ కూడా 16 ఇన్నింగ్స్‌లోనే 23 వికెట్లు తీసినా అతడు ఓవర్‌కు 9 రన్స్‌ ఇచ్చాడు. బుమ్రా మాత్రం గతేడాది వరల్డ్‌కప్‌ నుంచి ఇప్పటి వరకూ కేవలం మూడు టీ20లే ఆడాడు. అటు షమి మాత్రం గతేడాది నవంబర్‌ నుంచి ఒక్క టీ20లోనూ ఇండియాకు ఆడలేదు.

WhatsApp channel