FIFA World Cup Eng vs IRN: ఇరాన్‌ను చిత్తుగా ఓడించి ఇంగ్లండ్‌ బోణీ-fifa world cup eng vs irn as england beat iran by 6 goals to 2 in their opening game ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Fifa World Cup Eng Vs Irn: ఇరాన్‌ను చిత్తుగా ఓడించి ఇంగ్లండ్‌ బోణీ

FIFA World Cup Eng vs IRN: ఇరాన్‌ను చిత్తుగా ఓడించి ఇంగ్లండ్‌ బోణీ

Hari Prasad S HT Telugu
Nov 21, 2022 08:51 PM IST

FIFA World Cup Eng vs IRN: ఇరాన్‌ను చిత్తుగా ఓడించి ఇంగ్లండ్‌ బోణీ చేసింది. ఫిఫా వరల్డ్‌ కప్‌ తొలి మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మాజీ ఛాంపియన్‌ అందుకు తగినట్లే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

ఫిఫా వరల్డ్ కప్ లో ఘనంగా బోణీ చేసిన ఇంగ్లండ్
ఫిఫా వరల్డ్ కప్ లో ఘనంగా బోణీ చేసిన ఇంగ్లండ్ (AFP)

FIFA World Cup Eng vs IRN: ఫిఫా వరల్డ్‌కప్‌లో మాజీ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ బోణీ చేసింది. ఇరాన్‌తో సోమవారం (నవంబర్ 21) జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 6-2 తేడాతో ఘన విజయం సాధించింది. ఫస్ట్‌ హాఫ్‌లోనే మూడు గోల్స్‌ చేసి 3-0 లీడ్‌లోకి దూసుకెళ్లిన ఆ టీమ్‌.. సెకండాఫ్‌లో మరో మూడు గోల్స్ చేసింది. ఇరాన్‌ కూడా సెకండాఫ్‌లో రెండు గోల్స్‌తో సంతృప్తి చెందింది.

మ్యాచ్‌ 35వ నిమిషంలో ఇంగ్లండ్‌ తొలి గోల్‌ చేసింది. జూడ్‌ బెల్లింగ్‌హామ్‌ ఈ గోల్‌ చేశాడు. ఆ తర్వాత 8 నిమిషాలకే ఇంగ్లండ్‌ మరో గోల్‌ చేసింది. ఈసారి పెనాల్టీ కార్నర్‌ను బుకాయో సాకా గోల్‌గా మలిచాడు. మరో మూడు నిమిషాల వ్యవధిలోనే ఇంగ్లండ్‌ తన మూడో గోల్ చేసింది. ఈసారి కెప్టెన్‌ హ్యారీ కేన్‌ ఈ గోల్‌ చేశాడు. దీంతో సగం సమయం ముగిసే సరికి ఇంగ్లండ్‌ 3-0 లీడ్‌లోకి దూసుకెళ్లింది.

సెకండాఫ్‌లోనూ త్రీలయన్స్‌ జోరు కొనసాగింది. 64వ నిమిషంలో సాకా మరో గోల్ చేయడంతో ఇంగ్లండ్‌ 4-0 లీడ్‌లోకి దూసుకెళ్లింది. అయితే ఆ మరుసటి నిమిషంలోనే ఇరాన్ తన తొలి గోల్‌ చేసింది. మెహదీ తరేమీ ఇరాన్‌కు ఈ గోల్‌ చేసి పెట్టాడు. ఇక 71 నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మార్కస్‌ రాష్‌ఫోర్డ్‌ ఇంగ్లండ్‌కు ఐదో గోల్‌ అందించాడు. ఇక 90వ నిమిషంలో ఇంగ్లండ్‌ తరఫున జాక్ గ్రీలిష్ మరో గోల్డ్‌ చేయడంతో ఇంగ్లండ్‌ ఆధిక్యం 6-1కి చేరింది.

ఆ తర్వాత ఇంజురీ టైమ్‌ చివరి నిమిషంలో పెనాల్టీ కిక్‌ అందుకున్న ఇరాన్‌ మరో గోల్ చేయగలిగింది. ఈసారి కూడా మెహదీ తరేమీయే ఇరాన్‌కు రెండో గోల్ అందించాడు. ఆ వెంటనే ఫైనల్‌ విజిల్‌ మోగడంతో ఇంగ్లండ్‌ 6-2తో ఘన విజయం సాధించి ఫిఫా వరల్డ్‌ కప్‌ 2022లో బోణీ చేసింది.

WhatsApp channel