Dwane Bravo | ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన బ్రేవో.. అత్యధిక వికెట్లతో రికార్డు-dwane bravo is highest wicket taker in ipl history and breaks malinga record ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Dwane Bravo | ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన బ్రేవో.. అత్యధిక వికెట్లతో రికార్డు

Dwane Bravo | ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన బ్రేవో.. అత్యధిక వికెట్లతో రికార్డు

Maragani Govardhan HT Telugu
Apr 01, 2022 05:12 PM IST

చెన్నై ప్లేయర్ డ్వేన్ బ్రేవో ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు మలింగ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. తన రికార్డును అధిగమించడంపై లసిత్ మలింగ కూడా బ్రేవోను ప్రశంసించాడు.

డ్వేన్ బ్రేవో
డ్వేన్ బ్రేవో (PTI)

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ డ్వేన్ బ్రేవో అరుదైన రికార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు(171) తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. గతరాత్రి లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపక్ హుడా వికెట్ తీయడంతో డ్వేన్ బ్రేవో ఈ ఘనత సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు లసిత్ మలింగ(170) పేరిట ఉండేది. ఈ సీజన్ ముందు వరకు వీరిద్దరి మధ్య మూడు వికెట్ల వ్యత్యాసముండేది. కోల్‌కతాతో జరిగిన తొలి మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన బ్రేవో.. 170 వికెట్లతో మలింగ సరసన చేరాడు. లక్నోపై మ్యాచ్‌లో దీపక్ వికెట్ తీయడంతో ఆ రికార్డును అధిగమించాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన డ్వేన్ బ్రేవోపై లసిత్ మలింగ స్పందించాడు. బ్రేవో ఛాంపియన్ అంటూ ట్విట్టర్ వేదికగా తన స్పందనను తెలియజేశాడు.

“బ్రేవో ఛాంపియన్. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బ్రోవోకు శుభాకాంక్షలు. ఇంకా ముందుకు వెళ్లాలి యంగ్ మ్యాన్"" అంటూ బ్రేవోను మలింగ ప్రశంసించాడు.

ఈ సీజన్ ప్రారంభమయ్యేంత వరకు ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ రికార్డు లసిత్ మలింగ పేరిట ఉండేది. ఈ శ్రీలంక ఆటగాడు 122 మ్యాచ్‌ల్లో 20 కంటే తక్కువ సగటుతో 170 వికెట్లు తీశాడు. 2008 నుంచి 2019 వరకు ముంబయి ఇండియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన మలింగ ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. ముంబయి నాలుగు సార్లు ఐపీఎల్ టైటిళ్లను గెలవడంతో మలింగ కీలక పాత్ర పోషించాడు. ఇదే సమయంలో డ్వేన్ బ్రేవో 152 మ్యాచ్‌ల్లో 171 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

చెన్నైతో గురువారం జరిగిన మ్యాచ్ విషయానికొస్తే ఇందులో లక్నో ఘన విజయం సాధించింది. 211 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో జట్టు చివరి వరకు పోరాడి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. లక్నో బ్యాటర్లలో ఎవిన్ లూయిస్(55) చెన్నై గెలుపును దూరం చేశాడు. ముఖ్యంగా శివమ్ దూబే వేసిన 19 ఓవర్లో 25 పరుగులు పిండుకుని లక్నో విజయాన్ని ఖరారు చేశాడు. డికాక్(61) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. కేఎల్ రాహుల్ (40)అదరగొట్టారు. చెన్నై బౌలర్లలో డ్వేన్ ప్రిటోరియస్ 2 వికెట్లు తీయగా.. తుషార్ దేశ్‌పాండే, డ్వేన్ బ్రేవో చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్