WI vs Ind: వెస్టిండీస్‌పై టీమిండియాలోని 11 మందీ బౌలింగ్‌ చేశారన్న విషయం తెలుసా?-do you know all the 11 members of the indian team bowled at west indies in 2002 tour ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wi Vs Ind: వెస్టిండీస్‌పై టీమిండియాలోని 11 మందీ బౌలింగ్‌ చేశారన్న విషయం తెలుసా?

WI vs Ind: వెస్టిండీస్‌పై టీమిండియాలోని 11 మందీ బౌలింగ్‌ చేశారన్న విషయం తెలుసా?

Hari Prasad S HT Telugu
Jul 21, 2022 11:47 AM IST

WI vs Ind: వెస్టిండీస్‌తో సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. ఇప్పటికే వన్డే టీమ్‌ ఆ దేశానికి వెళ్లింది. అయితే గతంలో విండీస్‌ టూర్‌కు వెళ్లిన ఇండియన్‌ టీమ్‌లోని 11 మందీ ఒకే ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేశారన్న విషయం మీకు తెలుసా?

ఆ మ్యాచ్ లోనే ఇప్పటి టీమ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తన తొలి టెస్ట్ వికెట్ తీశాడు
ఆ మ్యాచ్ లోనే ఇప్పటి టీమ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తన తొలి టెస్ట్ వికెట్ తీశాడు (Action Images via Reuters)

ట్రినిడాడ్‌: వెస్టిండీస్‌ టూర్‌ అంటే ఎప్పుడూ స్పెషలే. క్రికెట్‌ను ఎంతగానో అభిమానించే కరీబియన్‌ దీవుల ప్రజలు అక్కడికి ఏ టీమ్‌ వెళ్లినా బాగా ఆదరిస్తారు. కలిప్సో బీట్లు, సాంబా డ్యాన్స్‌లతో స్టేడియాలు హోరెత్తుతుంటాయి. ఇండియన్‌ టీమ్‌ కూడా కరీబియన్‌ టూర్‌ను ఎప్పుడూ బాగానే ఎంజాయ్‌ చేసింది. ఒకప్పుడు క్రికెట్‌ ప్రపంచాన్ని ఏలిన వెస్టిండీస్‌లో టూర్‌ అంటే టీమిండియాకు ఎప్పుడూ సవాలే.

ఇప్పుడు మరో కీలకమైన టూర్‌కు ఇండియన్‌ టీమ్‌ సిద్ధమైన వేళ.. గత టూర్‌లలో జరిగిన ఓ ఇంట్రెస్టింగ్‌ విషయం గురించి తెలుసుకుందాం. 2002 టూర్‌లో ఓ టెస్ట్‌ సందర్భంగా ఇండియన్‌ టీమ్‌లోని మొత్తం 11 మంది బౌలింగ్‌ చేయడం విశేషం. టెస్ట్‌ క్రికెట్‌లో ఇప్పటి వరకూ ఇలా కేవలం నాలుగుసార్లు మాత్రమే ఇలా జరగగా.. ఆ అరుదైన రికార్డులో ఇండియా కూడా చేరింది.

2002, మే 14న వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో ఈ ఘటన జరిగింది. అప్పుడు టీమిండియా వికెట్‌ కీపర్‌గా ఉన్న అజయ్‌ రాత్రా కూడా గ్లోవ్స్‌ పక్కన పెట్టి బౌలింగ్ చేయడం విశేషం. టీమ్‌లో బౌలింగ్ చేసిన చివరి సభ్యుడు రాత్రానే. ఆ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ బ్యాటర్లు చందర్‌పాల్, కార్ల్‌ హూపర్‌, రిడ్లీ జాకబ్స్‌ సెంచరీల మోత మోగించారు.

టీమిండియా తన బౌలర్లను మార్చి మార్చి వేసినా ప్రయోజనం లేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా 513 రన్స్‌ చేయగా.. వెస్టిండీస్‌ ఏకంగా 629 రన్స్‌ చేసింది. ఆ మ్యాచ్‌లో ప్రధాన బౌలర్లు అయిన జవగళ్ శ్రీనాథ్‌, ఆశిష్‌ నెహ్రా, జహీర్‌ ఖాన్‌, అనిల్‌ కుంబ్లేలతోపాటు గంగూలీ, సచిన్‌, లక్ష్మణ్‌, ద్రవిడ్‌, వసీం జాఫర్‌, శివ్‌ సుందర్‌ దాస్‌, అజయ్‌ రాత్రాలు కూడా బౌలింగ్‌ చేశారు.

శ్రీనాథ్‌ 45, నెహ్రా 49, జహీర్‌ 48 ఓవర్లు వేయడం విశేషం. ప్రధాన బౌలర్లు అలసిపోతుండటంతో పార్ట్‌టైమ్‌ బౌలర్లందరూ తలా ఓ చేయి వేశారు. ఈ మ్యాచ్‌ చివరికి డ్రాగా ముగిసినా.. ఆ ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో వెస్టిండీస్ 2-1తో గెలిచింది.

WhatsApp channel

సంబంధిత కథనం