Pat Cummins : ప్రపంచకప్‌కు ముందు ఆసీస్ జట్టుకు షాక్.. భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు కెప్టెన్‌ దూరం!-cricket news australia captain pat cummins will miss the odi series against india due to injury details inside ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pat Cummins : ప్రపంచకప్‌కు ముందు ఆసీస్ జట్టుకు షాక్.. భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు కెప్టెన్‌ దూరం!

Pat Cummins : ప్రపంచకప్‌కు ముందు ఆసీస్ జట్టుకు షాక్.. భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు కెప్టెన్‌ దూరం!

Anand Sai HT Telugu
Aug 06, 2023 07:28 AM IST

Pat Cummins : భారత్‌లో అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న 2023 ICC ODI ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద షాక్ తగిలింది. మణికట్టు గాయం కారణంగా పాట్ కమిన్స్ భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది.

పాట్ కమిన్స్
పాట్ కమిన్స్ (twitter)

ఇంగ్లండ్‌తో 2023 యాషెస్ టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో మొదటి రోజు పాట్ కమ్మిన్స్ మణికట్టుకు గాయమైంది. అయితే, గాయం ఉన్నప్పటికీ అతను మ్యాచ్ ఆడినట్లు నివేదికలు తెలిపాయి. అయితే కమిన్స్ కు కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని ఆస్ట్రేలియా భావిస్తోంది. దీంతో సెప్టెంబరు 22న భారత్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో కెప్టెన్ ఆడతాడో లేదో స్పష్టత లేదు. ఈ విషయంపై క్రికెట్ ఆస్ట్రేలియా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

మణికట్టు ఫ్రాక్చర్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా తోసిపుచ్చలేదు. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఈ విషయాన్ని నివేదించింది. అదే నిర్ధారణ అయితే, పాట్ కమ్మిన్స్ గైర్హాజరు 2023 వన్డే ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా ప్రణాళికలకు ఎదురుదెబ్బ తగిలినట్టవుతుంది. పాట్ కమిన్స్ తన తల్లి అనారోగ్యం కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌తో జరిగిన 2023 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో మధ్యలోనే ఇంటికి తిరిగి వచ్చాడు.

తర్వాత 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో వచ్చాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బౌలింగ్‌లో యాషెస్ సిరీస్‌లో అత్యుత్తమంగా నిలిచాడు. ఇంగ్లండ్‌పై 2-2తో డ్రా చేసుకుని టైటిల్‌ను నిలబెట్టుకోగలిగారు. దక్షిణాఫ్రికా మరియు భారత్‌తో జరగనున్న వైట్‌బాల్ సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే, పాట్ కమిన్స్ వైట్ బాల్ సిరీస్‌కు దూరమైతే, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ఆస్ట్రేలియా జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది.

ఆగస్టు 30 నుంచి ఆస్ట్రేలియా మూడు టీ20లు, ఐదు వన్డేల కోసం దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఆ తర్వాత భారత్‌లో పర్యటించనున్నారు. 2023 వన్డే ప్రపంచకప్‌కు ముందు పాట్ కమిన్స్ ఆస్ట్రేలియా జట్టుకు పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి రాగలడని క్రికెట్ ఆస్ట్రేలియా ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇటీవల ముగిసిన యాషెస్ 2023లో కమిన్స్ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. పాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాకు ఈ సిరీస్‌లో శుభారంభం లభించింది. సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ యాషెస్ సిరీస్‌లో 18 వికెట్లు పడగొట్టి సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. అలాగే, అతను ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 162 పరుగులు చేశాడు. ఇందులో మొదటి టెస్ట్ మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కూడా ఉంది.

WhatsApp channel