Bhogi Significance : భోగ భాగ్యాలు కలగాలంటే.. భోగిరోజు వీటిని చేయండి..
Bhogi Significance 2023 : సంక్రాంతి అనేది ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చే మొదటి పెద్ద పండుగ. కొందరు సంక్రాంతిని మూడు రోజులు జరుపుకుంటే.. మరికొందరు నాలుగు రోజులు జరుపుకుంటారు. వీటిలో మొదటిరోజు భోగి. 2023లో వచ్చే భోగిని జనవరి 14వ తేదీన జరుపుకుంటున్నాము. ఇంతకీ భోగి ప్రాముఖ్యత ఏమిటి? ఆ రోజు ఏమి చేస్తే పుణ్య ఫలితాలు ఉంటాయి.. వంటి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Bhogi Significance : సనాతన ధర్మంలో కాలానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం కాలాన్ని సూర్య, చంద్ర, నక్షత్రాల ఆధారంగా లెక్కిస్తారు. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించేటటువంటి కాలమును రవి సంక్రమణం అని జ్యోతిష్యశాస్త్రం చెప్తోంది. ఈ రవి సంక్రమణాలు జరిపేటటువంటి కాలమును పుణ్యకాలముగా శాస్త్రములు తెలిపినట్లుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలకమర్తి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
చలిని తరిమేసే పండుగ
ఇలా సూర్య భగవానుడు ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించిన పుణ్యసమయమే మకర సంక్రాంతిగా చెప్తారు. మకర సంక్రాంతికి ముందు రోజును భోగిగా భక్తులు జరుపుకుంటారు. సంక్రాంతి సమయము చలి అధికముగా ఉండేటటువంటి కాలము. అయితే భోగి రోజు చలి పులిని తరిమికొడుతూ ప్రజలు ఉదయాన్నే లేచి చలిమంటలు వేసుకుంటారు.
గతాన్ని మంటల్లో కాల్చేస్తూ..
తమలోని పాత ఆలోచనలు అగ్నికి ఆహుతియై కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవుని వేడుకుంటారు. ఇంట్లోని పాత వస్తువులను భోగిమంటల్లో వేసి.. తమ గతాన్ని వదిలించుకుంటారు. అందుకే భోగిరోజు తెల్లవారు జామునే లేచి బ్రహ్మముహూర్తకాల సమయమునందు భోగి మంటలను వేసి.. అగ్ని దేవతను తలచుకొని.. అక్కడ లభించినటువంటి విభూదిని ప్రధానంగా స్వీకరించడం ఆచారంగా వస్తుంది. ఆ భోగిమంటలపై కాచిన నీళ్లతో.. ఇంటిల్లపాది తలస్నానము చేసి కొత్త బట్టలు ధరించి.. పూజిస్తే.. లక్ష్మీకటాక్షం కలుగుతుందని భావిస్తారు.
నూతన జీవితానికి ఆరంభం..
ఈరోజు అన్నీ కొత్త వాటితో ముడిపడి ఉంటాయి. అందుకే భోగి నూతన జీవిత ఆరంభానికి గుర్తుగా నిలుస్తోంది. భోగిరోజు సాయంత్రం ప్రతీ ఇల్లు శుభ్రపరచుకొని దీపాలు వెలిగించి.. బొమ్మలకొలువును ఏర్పాటుచేసి.. పిల్లలకు భోగిపళ్లు వేస్తారు. భోగి పళ్లు, శనగలు, పువ్వులు, కాయిన్స్ పిల్లలను తల మీదనుంచి పోయటం వలన.. వారికి ఉన్న నరఘోష తొలగిపోతుందని చెప్తారు. అంతేకాకుండా పిల్లలపై సూర్యభగవానుని ఆశీస్సులు కలిగి ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్ముతారు. ఆ ఇంటికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయని కూడా అంటారు.
రేగుపండ్లే ఎందుకు వేస్తారంటే..?
భోగి పళ్లలో ఉన్న సనాతన విషయము ఏమిటంటే.. రేగుపండ్లు అంటే సూర్యునికి ప్రీతికరమైన పండు. సూర్యభగవానుని అనుగ్రహం పిల్లలపై ఉండాలని.. ఈ రేగుపళ్లు పోస్తారు. దీని వలన సూర్యభగవానుని ద్వారా అందవలసిన శక్తి ఈ రేగుపళ్లకు అంది.. వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయని సనాతన ధర్మంలో ఉంది. ఇలా ఎవరైతే ఇంటిలో బంధుమిత్రులను కుటుంబ సభ్యులను భోగి రోజు పిలిచి పిల్లలకు భోగిపళ్లు పోస్తారో.. పెద్దలు నూతన వస్త్రములు ధరించి.. కుటుంబముతో ఆనందముగా గడుపుతారో.. అలాగే భోగిరోజు శ్రీమన్నారాయణుని సూర్యభగవానుని ఆరాధిస్తారో.. వారికి భోగ భాగ్యాలు సిద్ధిస్తాయిని సనాతన ధర్మం తెలిపింది.