రెట్రో-స్టైల్ ఎలక్ట్రిక్ బైక్‌ 'ఆటుమ్ 1.0' నడపడానికి లైసెన్స్ అవసరమే లేదు!-ride without license and registration here is atum 1 0 electric bike ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Ride Without License And Registration, Here Is Atum 1.0 Electric Bike!

రెట్రో-స్టైల్ ఎలక్ట్రిక్ బైక్‌ 'ఆటుమ్ 1.0' నడపడానికి లైసెన్స్ అవసరమే లేదు!

Manda Vikas HT Telugu
Jan 04, 2022 10:30 AM IST

హైదరాబాద్‌కి చెందిన 'ఆటుమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్' అనే EV స్టార్టప్ ఆటుమ్ 1.0 పేరుతో ఓ ఎలక్ట్రిక్ బైక్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధరను రూ. 54,999/- గా నిర్ణయించారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ని తమ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.

Atum 1.0 .EV
Atum 1.0 .EV (Stock Photo)

భారతదేశానికి చెందిన ఒక కొత్త ఎలక్ట్రిక్ వాహన సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తమ మొదటి ఎలక్ట్రిక్ బైక్ "ఆటుమ్ వెర్షన్ 1.0" ని 2020లో మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ రెట్రో-స్టైల్ ఎలక్ట్రిక్ బైక్‌తయారీ పూర్తిగా మన దేశంలోనే అది కూడా తెలంగాణలోని గ్రీన్ ఫీల్డ్ తయారీ కేంద్రం నుంచే జరుగింది. హైదరాబాద్‌కి చెందిన 'ఆటుమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్' అనే EV స్టార్టప్ ఆటుమ్ 1.0 పేరుతో ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధరను రూ. 54,999/- గా నిర్ణయించారు. కేవలం రూ. 3000 రిఫండబుల్ టోకెన్ ధరతో ఈ ఆటుమ్ 1.0 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ని తమ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.

లైసెన్స్ అవసరం లేదు..

ICAT (ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ) ద్వారా ఆమోదం పొందిన ఈ Atum 1.0 తక్కువ వేగం కలిగిన ఎలక్ట్రిక్ బైక్‌గా రికార్డుల్లో నిలిచింది. దీని గరిష్ట వేగం 25 -35 kmph కి మాత్రమే పరిమితం చేశారు. అందువల్ల Atum 1.0కు రిజిస్ట్రేషన్ గానీ, దీనిని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ గానీ అవసరం లేదు.

250W ఎలక్ట్రిక్ మోటార్‌తో నడిచే Atum 1.0 ఒక తేలికపాటి పోర్టబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది, ఇది సింగిల్ ఛార్జ్‌తో 100 కి.మీ దూరం ప్రయాణిస్తుంది లేదా 4 గంటల ఛార్జింగ్ సమయాన్ని కలిగి ఉంటుంది. దీని బ్యాటరీకి రెండు సంవత్సరాల వారంటీని అందిస్తున్నారు. సుమారు 6 కిలోల బరువుండే దీని బ్యాటరీని రెగ్యులర్ త్రీ-పిన్ సాకెట్‌ని ఉపయోగించి ఎక్కడైనా ఛార్జ్ చేయవచ్చు. ఒక్కో ఛార్జ్‌కు 1 యూనిట్ వినియోగం జరుగుతుంది. అంటే ఈ బైక్ 100 కిమీ దూరానికి అయ్యే ధర కేవలం రూ. 10 కంటే తక్కువే అవుతుందని చెబుతున్నారు.

అదనంగా 10 వేల యూనిట్ల ఉత్పత్తి..

ఈ ఎలక్ట్రిక్ బైక్‌చూడటానికి చాలా ట్రెండీగా ఒక మంచి రెట్రో స్పోర్ట్స్ బైక్ లుక్ కలిగి, మరెన్నో ఫీచర్లు ఇమిడి ఉంది. ఒకరు కూర్చునే విధంగా సౌకర్యవంతమైన సీటు, నడపటానికి వీలుగా సర్దుబాటు చేయగలిగే హ్యాండిల్స్, 20 "x 4" ఫ్యాట్-బైక్ టైర్లు, మంచి గ్రౌండ్ క్లియరెన్స్‌కలిగి ఉంది. వీటితో పాటు LED హెడ్‌లైట్, ఇండికేటర్లు, టెయిల్‌లైట్‌అంతేకాకుండా పూర్తి డిజిటల్ డిస్‌ప్లేతో అన్ని విధాలుగా ఆకర్షిస్తుంది. అనేక రకాల రంగులలో లభ్యమవుతున్న Atum 1.0 దేశంలో ఎక్కడి నుంచైనా అటుమొబైల్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఏడాదికి సుమారు 15 వేల యూనిట్లు ఉత్పత్తి చేయనున్నారు, డిమాండ్‌ను బట్టి అదనంగా మరో 10 వేల యూనిట్లు ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ కంపెనీ కలిగిఉంది.

IPL_Entry_Point