2000 notes: అక్టోబర్ 1 నుంచి 2 వేల రూపాయల నోటు చెల్లదు; వెంటనే బ్యాంకుల్లో మార్చుకోండి-rbi to withdraw rs 2000 currency note from circulation ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2000 Notes: అక్టోబర్ 1 నుంచి 2 వేల రూపాయల నోటు చెల్లదు; వెంటనే బ్యాంకుల్లో మార్చుకోండి

2000 notes: అక్టోబర్ 1 నుంచి 2 వేల రూపాయల నోటు చెల్లదు; వెంటనే బ్యాంకుల్లో మార్చుకోండి

HT Telugu Desk HT Telugu
May 19, 2023 08:07 PM IST

₹2000 notes: 2 వేల రూపాయల నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 2 వేల నోటు సెప్టెంబర్ 30వ తేదీ వరకే చెల్లుతుందని, ఈ లోపు తమ వద్ద ఉన్న 2 వేల రూపాయల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని శుక్రవారం సంచలన ప్రకటన చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (AFP File Photo)

2000 notes: రూ. 2 వేల నోటును చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. 2023 సెప్టెంబర్ 30 తేదీ వరకే రూ. 2 వేల నోటు చెల్లుతుందని, ఆ లోపే తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని సూచించింది. అన్ని బ్యాంకుల్లో ఈ నోట్లు ను మార్చుకోవచ్చని వెల్లడించింది. ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను తమ ఖాతా ఉన్న బ్యాంక్ బ్రాంచ్ లో కానీ, లేదా ఏదైనా బ్యాంక్ బ్రాంచ్ లో కానీ మార్చుకోవచ్చు. మే 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు బ్యాంకుల్లో ఈ రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చు. అయితే, ఒక రోజులో గరిష్టంగా రూ. 20 వేల విలువైన నోట్ల వరకు మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది.

2000 notes: నవంబర్ 2016 నుంచి..

రూ. 2 వేల నోట్లను 2016 నవంబర్ లో ఆర్బీఐ మార్కెట్లో ప్రవేశపెట్టింది. అప్పటివరకు చెలామణిలో ఉన్న రూ. 500, రూ. 100 నోట్లను రద్దు చేస్తూ ఆకస్మిక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కొత్తగా ఈ రూ. 2 వేల నోట్లను, రూ. 500 నోట్లను చెలామణిలోకి తీసుకువచ్చింది. మిగతా డినామినేషన్లలో కరెన్సీ నోట్లు అవసరమైనంత మొత్తంలో అందుబాటులోకి వచ్చేవరకు మాత్రమే రూ. 2 వేల నోట్లను చెలామణిలో ఉంచుతామని నాడు ఆర్బీఐ ప్రకటించింది. ఆ నిర్ణయంలో భాగంగానే, 2018 -19 నుంచే రూ. 2 వేల నోట్లను ముద్రించడం నిలిపివేసింది. అలాగే, 2017 మార్చి కన్నా ముందు ముద్రించిన రూ. 2 వేల నోట్లలో దాదాపు 89% నోట్ల జీవితకాలం ఇప్పుడు ముగింపు దశకు వచ్చిందని ఆర్బీఐ పేర్కొంది.వాటి లైఫ్ స్పాన్ 4 నుంచి 5 సంవత్సరాలేనని వెల్లడించింది. మరోవైపు, దైనందిన కార్యకలాపాల్లో రూ. 2 వేల నోట్ల వినియోగం చాలా తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించామని ఆర్బీఐ తెలిపింది. మార్చి 31, 2023 నాటికి భారత్ లో చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల విలువ రూ. 3.62 లక్షల కోట్లు. 2018 మార్చి 31 న భారత్ లో చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల విలువ రూ. 6.73 లక్షల కోట్లు.

WhatsApp channel