Q2 Results: మోల్డ్‌టెక్ నికర లాభం 10 శాతం అప్.. దివీస్ 18 శాతం డౌన్-moldtek q2 net 10 percent up divis lab net dips 18 percent ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Q2 Results: మోల్డ్‌టెక్ నికర లాభం 10 శాతం అప్.. దివీస్ 18 శాతం డౌన్

Q2 Results: మోల్డ్‌టెక్ నికర లాభం 10 శాతం అప్.. దివీస్ 18 శాతం డౌన్

HT Telugu Desk HT Telugu
Nov 07, 2022 04:28 PM IST

దివీస్ లాబ్స్, మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేశాయి.

Moldtek packaging Q2 Results: ప్యాకేజింగ్ విభాగంలో మంచి పనితీరు కనబరుస్తున్న మోల్డ్‌టెక్
Moldtek packaging Q2 Results: ప్యాకేజింగ్ విభాగంలో మంచి పనితీరు కనబరుస్తున్న మోల్డ్‌టెక్ (Moldtek packaging ltd)

ప్యాకేజింగ్‌ రంగంలో ఉన్న మోల్డ్‌టెక్‌ ప్యాకేజింగ్‌ సెప్టెంబర్‌ త్రైమాసికం స్టాండలోన్‌ ఫలితాల్లో నికరలాభం రూ. 19.4 కోట్లు సాధించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లాభంలో 10.4 శాతం వృద్ధి నమోదైంది. ఎబిటా 6.15 శాతం ఎగసి రూ. 34.24 కోట్లుగా ఉంది. టర్నోవర్‌ 14.4 శాతం అధికమై రూ. 182.5 కోట్లు సాధించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త యూనిట్లు, ఇప్పటికే ఉన్న ప్లాంట్ల విస్తరణకు ఇప్పటికే రూ. 50 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ. 75 కోట్లు వ్యయం చేయనున్నట్టు మోల్డ్‌టెక్‌ ప్యాకేజింగ్‌ సీఎండీ జె.లక్ష్మణ రావు తెలిపారు. ఈ ప్రాజెక్టులు 6-9 నెలల్లో పూర్తి కానున్నాయని వెల్లడించారు.

ఓటీసీ ఉత్పత్తుల కోసం ఇంజెక్షన్‌ బ్లో మౌల్డింగ్‌ (ఐబీఎం) ప్యాకేజింగ్‌ ప్లాంటులో 2023 జనవరిలో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఫార్మా ఉత్పత్తుల కోసం ఐబీఎం ఫెసిలిటీలను ఏప్రిల్‌లో నెలకొల్పుతామని అన్నారు. కస్టమర్ల నుంచి డిమాండ్‌ నేపథ్యంలో హైదరాబాద్‌, వైజాగ్‌, మైసూర్‌, సతారా ప్రాజెక్టుల సామర్థ్యం పెంచామని వివరించారు.

ఆదిత్య బిర్లా గ్రూప్‌ కోసం రూ.30 కోట్లతో హర్యానా ప్లాంటు ఏర్పాటు చేస్తున్నామన్నారు. డామన్‌లో రెండవ ప్లాంటు స్థాపించేందుకు స్థలం సేకరించామని చెప్పారు. విద్యుత్‌ వ్యయాలను తగ్గించుకునేందుకు అన్ని యూనిట్లలో సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

దివీస్ నికర లాభంలో తగ్గుదల

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం 18 శాతం క్షీణించి రూ. 494 కోట్లకు చేరుకుందని దివీస్ లేబొరేటరీస్ సోమవారం వెల్లడించింది.

గత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ కాలంలో ఔషధ సంస్థ రూ. 606 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

సెప్టెంబర్ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రూ.1,987 కోట్ల నుంచి రూ. 1,854 కోట్లకు తగ్గింది.

బీఎస్‌ఈలో సోమవారం ఈ కంపెనీ షేర్లు 8.63 శాతం తగ్గి రూ. 3,422 వద్ద ముగిశాయి.

WhatsApp channel