Kia India sales: 43 శాతం పెరిగిన కియా కార్ల అమ్మకాలు
Kia India sales: అక్టోబరు నెలలో కియా కార్ల అమ్మకాలు 43 శాతం పెరిగాయి.
న్యూఢిల్లీ: అక్టోబర్‌లో హోల్‌సేల్ విక్రయాలు గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే ఈ అక్టోబరులో 43 శాతం పెరిగి 23,323 యూనిట్లకు చేరుకున్నాయని కియా ఇండియా మంగళవారం వెల్లడించింది.
ఈ కార్ల కంపెనీ అక్టోబర్ 2021లో 16,331 యూనిట్లను డీలర్‌లకు పంపింది. ఈ అక్టోబరు నెలలో కంపెనీ సెల్టోస్ కార్లు 9,777 యూనిట్లు, సోనెట్ కార్లు 7,614 యూనిట్లు, కేరెన్స్ కార్లు 5,479 యూనిట్లు, కార్నివాల్ కార్లు 301 యూనిట్ల మేర అమ్మింది.
‘భారత మార్కెట్‌లో అన్ని కియా ఉత్పత్తులకు పెరిగిన డిమాండ్ ఉత్తేజకరమైన సమయాన్ని సూచిస్తోంది. ఇది మా ఉత్పత్తి వ్యూహం ప్రారంభం నుండి సరైన దిశలో వెళుతోందని సంకేతం ఇస్తోంది..’ అని కియా ఇండియా వైస్ ప్రెసిడెంట్ హర్దీప్ సింగ్ బ్రార్ ఒక ప్రకటనలో తెలిపారు.
2022లో కంపెనీ ఇప్పటికే 2 లక్షల విక్రయాల మార్కును అధిగమించింది. ఇంకా రెండు నెలలు మిగిలి ఉన్నందున వాహన తయారీ సంస్థ ఈ సంవత్సరాన్ని ఇంతకుముందు ఎన్నడూ లేని గరిష్ట స్థాయిలో ముగిస్తుందనే నమ్మకంతో ఉన్నట్టు ఆయన తెలిపారు.
ఏడాది పొడవునా స్థిరమైన అమ్మకాలతో కియా ఇండియా భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో పటిష్టమైన స్థానం దక్కించుకుందని బ్రార్ పేర్కొన్నారు.
అక్టోబరులో కియా కార్లతో పాటు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్స్ తదితర కార్ల కంపెనీ విక్రయాలు గణనీయమైన స్థాయిలో వృద్ధి చెందాయి. విజయ దశమి, దీపావళి పండగల నేపథ్యంలో కార్ల విక్రయాలు ఊపందుకున్నాయి.