Amazon Prime: సైలెంట్‍గా షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్: ప్లాన్‍ల ధరలు పెంపు
Amazon Prime Membership Price Hike: రెండు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్‍ల ధరలు పెరిగాయి. ప్రారంభ ప్లాన్ ధర భారీగా అధికమైంది.
Amazon Prime Membership Price Hike: అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్‍ల ధరలను అమెజాన్ మరోసారి పెంచింది. రెండు మెంబర్‌షిప్ ప్లాన్‍ల ధరలను ముందస్తుగా ప్రకటించకుండానే అధికం చేసింది. కొత్తగా ఆ ప్లాన్‍లు తీసుకోవాలనుకుంటున్న వారు ఇక నుంచి ఎక్కువ చెల్లించాల్సిందే. నెల (Month), మూడు నెలల (Three Months) ప్లాన్‍ల రేట్లను అమెజాన్ ఈసారి పెంచింది. వార్షిక ప్లాన్‍ల ధరల్లో మార్పు లేదు. నెల, మూడు నెలల అమెజాన్ ప్రైమ్ సబ్‍స్క్రిప్షన్ ప్లాన్‍ల కొత్త ధరలు ఎలా ఉన్నాయో, ఎవరికి వర్తిస్తాయో ఇక్కడ చూడండి.
కొత్త ధరలు ఇవే
Amazon Prime Membership Price Hike: రూ.179గా ఉన్న అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ నెల ప్లాన్ (Monthly Plan) ధరను ఏకంగా రూ.299కు పెంచింది అమెజాన్. అంటే ఒకేసారి రూ.120 అధికం చేసింది. ఇక కొత్తగా అమెజాన్ ప్రైమ్ తీసుకోవాలంటే యూజర్లు కచ్చితంగా కనీసం రూ.299 ప్లాన్ తీసుకోవాల్సిందే. ఇదే ప్రారంభ ప్లాన్‍గా ఉంది.
ఇక, రూ.459గా ఉన్న మూడు నెలల ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్ ధరను రూ.599కు పెంచింది అమెజాన్. అంటే రూ.140 అధికంగా చేసింది.
ఇప్పటికే వాడుతున్న వారికి పాత ధరే
Amazon Prime Membership Price Hike: అమెజాన్ ప్రైమ్ నెల, 3 నెలల ప్లాన్‍కు ఇప్పటికే సబ్‍స్క్రైబ్ చేసుకున్న వారు, ప్లాన్‍లను ఆటో రెన్యూవల్‍గా సెట్ చేసుకున్న వారికి పాత ధరలే వర్తించనున్నాయి. వీరికి 2024 జనవరి 15 వరకు పాత రేట్లే ఉండనున్నాయి. అయితే, ఇప్పుడు కొత్తగా ప్లాన్లు తీసుకునే వారికి, ఒకవేళ ఏదైనా కారణంగా ఆటో రెన్యూవల్ ఫెయిల్ సబ్‍స్క్రిప్షన్ కొనసాగకపోతే వారికి కొత్త ధరలు వర్తిస్తాయి.
అమెజాన్ ప్రైమ్ బెనిఫిట్స్
Amazon Prime Benefits: అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో సినిమాలు, వెబ్‍సిరీస్‍లు, టీవీషోలను చూడవచ్చు. వీడియో కంటెంట్ అంతా యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రైమ్ మెంబర్‌షిప్‍లో అమెజాన్ ప్లాట్‍ఫామ్‍లో షాపింగ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ప్రొడక్టుల ఫ్రీ డెలివరీ, ఉచిత వన్ డే డెలివరీ, ప్రత్యేక డీల్స్, సేల్‍లకు ఒక రోజు ముందే యాక్సెస్ లభిస్తాయి. ఇక ప్రైమ్ మెంబర్‌షిప్ ఉంటే అమెజాన్ మ్యూజిక్‍ను ఉచితంగా వాడుకోవచ్చు. కిండిల్, ప్రైమ్ గేమ్స్ బెనిఫిట్స్ కూడా దక్కుతాయి.