Rohit Sharma on Virat Kohli: కోహ్లి స్ట్రైక్ రేట్‌ గురించి అడిగితే నవ్విన రోహిత్ శర్మ.. ఏమన్నాడంటే..-rohit sharma laughed off when asked about virat kohli strike rate and his selection into t20 world cup 2024 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Sharma On Virat Kohli: కోహ్లి స్ట్రైక్ రేట్‌ గురించి అడిగితే నవ్విన రోహిత్ శర్మ.. ఏమన్నాడంటే..

Rohit Sharma on Virat Kohli: కోహ్లి స్ట్రైక్ రేట్‌ గురించి అడిగితే నవ్విన రోహిత్ శర్మ.. ఏమన్నాడంటే..

Hari Prasad S HT Telugu
May 02, 2024 08:44 PM IST

Rohit Sharma on Virat Kohli: విరాట్ కోహ్లి ఐపీఎల్ 2024లో ఎంతగా రాణిస్తున్నా అతని స్ట్రైక్ రేట్ విషయంలో మాత్రం చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఇదే ప్రశ్న కెప్టెన్ రోహిత్ శర్మను అడిగితే అతడు నవ్వి ఊరుకున్నాడు.

కోహ్లి స్ట్రైక్ రేట్‌ గురించి అడిగితే నవ్విన రోహిత్ శర్మ.. ఏమన్నాడంటే..
కోహ్లి స్ట్రైక్ రేట్‌ గురించి అడిగితే నవ్విన రోహిత్ శర్మ.. ఏమన్నాడంటే..

Rohit Sharma on Virat Kohli: ఐపీఎల్ 2024లో ఇప్పటికీ విరాట్ కోహ్లి ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. 10 మ్యాచ్ లలో 500 పరుగులతో కోహ్లి ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. ఒక సెంచరీ కూడా చేశాడు. అయితే అది ఐపీఎల్ చరిత్రలో స్లోయెస్ట్ సెంచరీ. దీంతో అతని స్ట్రైక్ రేట్ పై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక తర్వాత మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ దీనిపై స్పందించారు.

కోహ్లి స్ట్రైక్ రేట్‌పై రోహిత్ ఏమన్నాడంటే?

విరాట్ కోహ్లి టాప్ ఫామ్ లో ఉన్నా అతని స్ట్రైక్ రేట్ కారణంగా టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక చేయొద్దన్న డిమాండ్లు వినిపించాయి. నిజానికి ప్రస్తుతం ఈ సీజన్లో కోహ్లి స్ట్రైక్ రేట్ 147.49గా ఉంది. ఇది కచ్చితంగా చాలా మంచి స్ట్రైక్ రేట్ అనే చెప్పాలి. అయినా అతనిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. దీనిపై తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.

టీ20 వరల్డ్ కప్ కోసం మంగళవారం (ఏప్రిల్ 30) జట్టును ఎంపిక చేసిన తర్వాత గురువారం (మే 2) అతడు చీఫ్ సెలక్టర్ అగార్కర్ తో కలిసి మీడియాతో మాట్లాడాడు. కోహ్లి స్ట్రైక్ రేట్ గురించి ప్రస్తావన రాగానే సదరు జర్నలిస్టు ప్రశ్న అడగటం పూర్తయ్యే లోపే కెప్టెన్ రోహిత్ నవ్వేశాడు. దీంతో ఈ ప్రశ్నకు అగార్కర్ బదులిచ్చాడు.

"విరాట్ కోహ్లి స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడాలంటే దానిపై అసలు మేము చర్చించనే లేదు. ఐపీఎల్లో అతడు మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇందులో ఆందోళన చెందాల్సినది ఏమీ లేదు" అని అగార్కర్ స్పష్టం చేశాడు. టీ20 వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీల్లో కోహ్లి అనుభవం బాగా పనికొస్తుందని అతడు స్పష్టం చేశాడు.

"వరల్డ్ కప్ ఆడబోతున్నాం. అది అంతర్జాతీయ క్రికెట్. ఐపీఎల్ తో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. దానికి ప్రత్యేకంగా సిద్ధం కావాలి. అక్కడే అనుభవం అనేది ముఖ్యం అవుతుంది" అని అగార్కర్ అన్నాడు.

భారీ స్కోర్లపై స్పందిస్తూ..

ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో భారీ స్కోర్లు నమోదవుతున్న సంగతి తెలుసు కదా. 220కిపైగా లక్ష్యాలను కూడా ఛేదించేస్తున్నారు. పంజాబ్ కింగ్స్ అయితే ఏకంగా 262 రన్స్ చేజింగ్ తో టీ20 రికార్డు క్రియేట్ చేసింది. దీనిపైనా అగార్కర్ స్పందించాడు. "టీ20 వరల్డ్ కప్ కూడా ఐపీఎల్లాగే భారీ స్కోర్లు నమోదైతే.. దానికి తగినట్లు జట్టులో సరిపడా బ్యాలెన్స్, పవర్ ఉన్నాయి.

దాని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ ఫామ్, కొత్త కుర్రాళ్ల ఆటను చూసి సానుకూలాంశాలను తీసుకోవచ్చు. కానీ వరల్డ్ కప్ మ్యాచ్ బరిలోకి దిగినప్పుడు ఆ ఒత్తిడి పూర్తి భిన్నంగా ఉంటుంది" అని అగార్కర్ అన్నాడు.

ఇక విరాట్ కోహ్లి విషయానికి వస్తే టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అతడే అత్యధిక పరుగుల వీరుడు. ఇప్పటి వరకూ 27 వరల్డ్ కప్ మ్యాచ్ లలో కోహ్లి 1141 రన్స్ చేశాడు. అతని సగటు ఏకంగా 81.50 కాగా.. స్ట్రైక్ రేట్ కూడా 131.30గా ఉంది.

IPL_Entry_Point