Roger Federer Retirement: ఆటకు ఫెదరర్ గుడ్‌బై.. 24 ఏళ్లు 24 గంటల్లా గడిచాయి.. ట్వీటర్‌లో స్విస్ దిగ్గజం ఎమోషనల్ పోస్ట్-tennis player roger federer announces retirement ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Tennis Player Roger Federer Announces Retirement

Roger Federer Retirement: ఆటకు ఫెదరర్ గుడ్‌బై.. 24 ఏళ్లు 24 గంటల్లా గడిచాయి.. ట్వీటర్‌లో స్విస్ దిగ్గజం ఎమోషనల్ పోస్ట్

Maragani Govardhan HT Telugu
Sep 15, 2022 09:00 PM IST

Roger Federer Announces Retirement: స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. 24 కెరీర్‌లో ఎన్నో అపురూప విజయాలను అందుకున్న ఈ స్విస్ స్టార్ ఆటకు గుడ్‌బై చెప్పనున్నట్లు స్పష్టం చేశాడు. వచ్చే వారం జరగనున్న లేవర్ కప్ 2022నే చివరి ఏటీపీ ఫైనల్ ఈవెంట్ అని తెలిపాడు.

రోజర్ ఫెదరర్ రిటైర్మెంట్
రోజర్ ఫెదరర్ రిటైర్మెంట్ (AFP)

Roger Federer Announces Retirement: టెన్నీస్ స్టార్.. స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడు ర్యాకెట్ పట్టుకుని కోర్టులో దిగాడంటే ప్రత్యర్థులు బెదరాల్సిందే. టైటిళ్లు దాసోహమవ్వాలిసందే. 24 ఏళ్ల కెరీర్‌లో 20 గ్రాండ్‌స్లామ్‌లతో పాటు ఎన్నో మరపురాని విజయాలను సొంతం చేసుకున్నాడు. అయితే తన విజయాలకు ఫెదరర్ ముగింపు పలకనున్నాడు. టెన్నీస్‌కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో తనదైన విజయాలతో దూసుకెళ్లిన ఫెదరర్ ఈ ఏడాది జరగనున్న లేవర్ కప్ తర్వాత ఆటకు వీడ్కోలు పలకనున్నట్లు స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ఫెదరర్ తెలియజేశాడు.

2003లో తొలిసారిగా గ్రాండ్‌స్లామ్ సొంతం చేసుకున్న ఫెదరర్.. ఆ తర్వాత వెనక్కి తీసుకోలేదు. వింబుల్డన్‌తో మొదటి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో మూడో స్థానంలో నిలిచాడు. అతడి కంటే ముందు రఫెల్ నాదల్(22), నొవాక్ జకోవిచ్(21) ముందున్నారు. దీర్ఘకాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్న ఫెదరర్.. ఆటకు దూరంగా ఉన్నాడు. తన కెరీర్‌రో 6 ఆస్ట్రేలియన్ ఓపెన్, ఓ ఫ్రెంచ్ ఓపెన్, 8 వింబుల్డన్‌లు, 5 యూఎస్ ఓపెన్ టైటిళ్లు నెగ్గాడు. ట్విటర్ వేదికగా తన రిటైర్మెంట్ గురించి ప్రకటించిన ఫెదరర్.. ఓ నోట్‌ కూడా పోస్ట్ చేశాడు. వచ్చే వారం లండన్ వేదికగా జరగనున్న లేవర్ కప్ తన చివరి ఏటీపీ ఫైనల్ ఈవెంట్ అని స్పష్టం చేశాడు.

"నా టెన్నిస్ కుటుంబానికి, అంతకుమించి ఇన్నేళ్లుగా నాకు ఎన్నో బహుమతులు అందించిన ఆటకు, నా వెన్నంటే మద్దతుగా నిలిచిన అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు అందరితో నేను మీతో ఓ వార్తను పంచుకోవాలనుకుంటున్నాను. మీలో చాలా మందికి ఈ విషయం గురించి తెలుసు. గత మూడేళ్లుగా తరచూ గాయాలు, శస్త్రచికిత్సల రూపంలో నాకు సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. ఫామ్ పుంజుకుని పోటీలోకి తిరిగి వచ్చేందుకు నేను చాలా కష్టపడ్డాను. కానీ నా శరీర శక్తి, సామర్థ్యాలు, పరిమితులు కూడా నాకు తెలుసు, ఇప్పుడు నా వయస్సు 41 సంవత్సరాలు. గత 24 ఏళ్లుగా 1500కి పైగా మ్యాచ్‌లు ఆడాను. నేను కలలుగన్న దాని కంటే కూడా ఈ క్రీడా ఎంతో ఉదారంగా నన్ను చూసుకుంది. ఇప్పుడు నా కెరీర్‌ను ముగించే సమయం వచ్చిందని నేను గుర్తించాలి.

వచ్చే వారం లండన్ వేదికగా జరగనున్న లేవర్ కప్ నా చివరి ఏటీపీ ఈవెంట్. భవిష్యత్తులోనూ ఇంకా టెన్నీస్ ఆడతాను. కానీ గ్రాండ్‌స్లామ్‌లు, పర్యటనల్లో పాల్గొనను. ఇది కాస్త చేదు నిర్ణయమని అర్థమవుతుంది. ఎందుకంటే నేను ప్రతిదీ కోల్పోతాను. కానీ ఇదే సమయంలో సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇంకా చాలా ఉంది. భూమిపై ఉన్న అత్యంత అదృష్టవంతుల్లో ఒకరిగా నేను భావిస్తాను. నాకు టెన్నిస్ ఆడటానికి ఓ ప్రత్యేక టాలెంట్‌ను అందించారు. నేను ఊహించిన దాని కంటే కూడా ఎక్కువ స్థాయిలో ఉంచారు.

నాతో ప్రతి నిమిషం గడిపిన నా భార్య మిర్కాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నా. ఫైనల్స్‌కు ముందు ఆమె నాకు మద్దతుగా నిలిచింది. 8 నెలల గర్భవతిగా ఉండి కూడా లెక్కలేనన్ని మ్యాచ్‌లు చూసింది. 20 సంవత్సరాలకు పైగా నా బృందంతో కలిసి తాను కూడా బిజీగా గడిపింది. కొత్త ప్రదేశాలను అన్వేశించడానికి, జ్ఞాపకాలను ఏర్పరచుకోడానికి ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటూ నాకు మద్దతుగా ఉన్న నా నలుగురు పిల్లలకు కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా" అని ఫెదరర్ స్పష్టం చేశాడు.

41 ఏళ్ల రోజర్ ఫెదరర్.. వింబుల్డన్ 2021లో క్వార్టర్ ఫైనల్లో ఓటమి తర్వాత ఇతర గ్రాండ్ ‌స్లామ్‌లు ఆడలేదు. మోకాలి గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్నాడు. అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్దికాలానికే రోజర్ ఫెదరర్ కూడా రిటైర్ అవ్వడం గమనార్హం.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్