India vs South Africa 1st ODI: ప్రపంచకప్‌పైనే నా ఫోకస్.. శిఖర్ ధావన్ వ్యాఖ్యలు
Shikhar Dhawan About ODI: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ గురించి ధావన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తన ఫోకస్ అంతా 2023 ప్రపంచకప్‌పైనే ఉందని తెలిపాడు. అక్టోబరు 6న లక్నో వేదికగా తొలి వన్డే జరగనుంది.
India vs South Africa 1st ODI: దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ ముగిసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఇక వన్డే సిరీస్ ఆడనుంది. గురువారం నాడు ఇరు దేశాల మధ్య తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ వన్డే జట్టులో శిఖర్ ధావన్ రానున్నాడు. వన్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కేవలం వన్డే జట్టులో మాత్రమే ఆడుతున్న ధావన్.. రాబోయే సిరీస్‌లో సత్తా చాటాలని ఆశిస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ గురించి ధావన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తన ఫోకస్ అంతా 2023 ప్రపంచకప్‌పైనే ఉందని తెలిపాడు.
"సాధ్యమైనప్పుడల్లా నేను నా నాలెడ్జ్‌ను యువకులకు అందజేస్తాను. ఇప్పుడు నాపై కొత్త బాధ్యత ఉంది. కానీ నేను సవాళ్లతో కూడిన అవకాశాల కోసం చూస్తున్నాను. ప్రస్తుతం నా లక్ష్యం 2023 ప్రపంచకప్ పైనే ఉంది. అందుకే నేను ఫిట్‌గా ఉండాలనుకుంటున్నాను. ఈ ఫోటీలో ఉండటానికి మంచి మానసిక స్థితిని కలిగి ఉండాలనుకుంటున్నాను." అని ధావన్ స్పష్టం చేశాడు.
గత రెండేళ్లుగా వన్డేల్లో ధావన్ స్థిరంగా ఆడుతున్నాడు. శ్రీలంక, వెస్టిండీస్ పర్యటనల్లో టీమిండియా తరఫున కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. 36 ఏళ్ల ధావన్.. 158 వన్డేల్లో 92.07 స్ట్రైక్ రేటుతో 6647 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 38 అర్దశతకాలు ఉన్నాయి. తన కెరీర్ గురించి మాట్లాడిన శిఖర్.. తన కెరీర్ చాలా అందంగా సాగిందని, అందుకు తను చాలా సంతోషంగా ఉందని స్పష్టం చేశాడు.
లక్నో వేదికగా అక్టోబరు 6న దక్షిణాఫ్రికాతో తొలి వన్డే జరగనుంది. అయితే ప్రస్తుతం అక్కడ భారీగా వర్షాలు పడుతున్న కారణంగా బుధవారం జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్‌లోనూ టీమిండియా పాల్గొనలేదు.
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం భారత జట్టు..
శిఖర్ ధావన్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రాజత్ పాటిదార్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, షాబాద్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి భిష్ణోయ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్.
సంబంధిత కథనం