Ravishastri: ఆ ఆడి కారు నీకు రాదులే అని మియాందాద్‌ వెక్కిరించాడు: రవిశాస్త్రి-ravi shastri shares interesting things about the audi car which he won in world series ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ravi Shastri Shares Interesting Things About The Audi Car Which He Won In World Series

Ravishastri: ఆ ఆడి కారు నీకు రాదులే అని మియాందాద్‌ వెక్కిరించాడు: రవిశాస్త్రి

Hari Prasad S HT Telugu
Jun 04, 2022 03:22 PM IST

1985లో జరిగిన వరల్డ్‌ సిరీస్‌ను ఇండియా గెలుచుకుంది. ఆ సిరీస్‌లో రవిశాస్త్రి ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌గా నిలిచి ఆడీ కారు అందుకున్నాడు. ఇప్పుడా కారునే రవి రీస్టోర్‌ చేయించాడు.

వరల్డ్ సిరీస్ లో గెలుచుకున్న తన ఆడి కారులో రవిశాస్త్రి
వరల్డ్ సిరీస్ లో గెలుచుకున్న తన ఆడి కారులో రవిశాస్త్రి (PTI)

న్యూఢిల్లీ: ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌లో రవిశాస్త్రికి లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ ఉంది. అయితే వరల్డ్‌ సిరీస్‌లాంటి మెగా టోర్నీల్లో రాణించడం, ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు బాదడంలాంటి వాటితో తన ఆటతోనూ అతడు అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కామెంటేటర్‌, అనలిస్ట్‌గా, టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి అనేక పాత్రలు పోషించాడు. అయితే ఈ మధ్య తాను వరల్డ్‌ సిరీస్‌లో గెలుచుకున్న ఆడి కారు గురించి అతడు ఇంట్రెస్టింగ్‌ విషయాలు చెప్పాడు.

1985లో జరిగిన వరల్డ్‌ సిరీస్‌ను ఇండియా గెలుచుకుంది. ఆ టోర్నీ ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించింది. ఆ టోర్నీలో రవిశాస్త్రి ప్లేయర్‌ ఆఫ్ ద టోర్నమెంట్‌గా ఆడి కారును అందుకున్నాడు. ఈ వింటేజ్‌ కారును ఈ మధ్య రీస్టోర్‌ చేయించిన రవిశాస్త్రి.. ఈ సందర్భంగా ఫైనల్లో జరిగిన ఓ సంఘటన గురించి వివరించాడు. తాను బ్యాటింగ్‌ చేస్తున్న సమయలో పాక్‌ ప్లేయర్‌ జావెద్‌ మియాందాద్‌ తనతో స్లెడ్జింగ్ చేయడానికి ప్రయత్నించాడని చెప్పాడు.

"1985 బెన్సన్‌ అండ్ హెడ్జెస్‌ టోర్నమెంట్‌ ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించడానికి మాకు మరో 15-20 రన్స్‌ అవసరం ఉంది. ఆ సమయంలో జావెద్‌ మియాందాద్‌ సెట్‌ చేసిన ఫీల్డ్‌ను తెలుసుకోవడానికి స్క్వేర్‌ లెగ్‌ వైపు చూస్తున్నాను. అప్పుడు మిడ్‌ వికెట్‌లో ఉన్న మియాందాద్‌ నా దగ్గరికి వచ్చి.. నువ్వు మళ్లీ మళ్లీ అక్కడేం చూస్తున్నావ్‌ అని తనదైన స్టైల్లో అన్నాడు. కారును ఎందుకు చూస్తున్నావ్‌.. అది నీకు దక్కదు" అని మియాందాద్‌ అన్నట్లు రవిశాస్త్రి చెప్పాడు.

ఆ సమయంలోనే తాను కారును తదేకంగా చూస్తూ.. జావెద్‌.. అది నా వైపే వస్తోంది అని జావెద్‌తో చెప్పినట్లు రవి వెల్లడించాడు. వరల్డ్‌ కప్‌ గెలిచిన రెండేళ్ల తర్వాత వరల్డ్‌ సిరీస్‌ గెలవడం వెనుక ఉన్న ప్రత్యేకతను కూడా ఈ సందర్భంగా అతడు వివరించాడు. "నా జీవితంలో నేను చేసిన ఎన్నో పనుల కంటే ఈ కారు టాప్‌లో ఉంటుంది. ఆరు సిక్స్‌లు కూడా ఎప్పటికీ గుర్తొచ్చేదే అయినా.. నా కెరీర్‌లో ఈ కారుకే ఎక్కువ విలువుంది. అప్పుడప్పుడే వన్డే క్రికెట్‌లోకి రంగులు రావడం, డే నైట్‌ మ్యాచ్‌లు, రంగుల దుస్తులు, చానెల్‌ 9 తొలిసారి ఇండియాకు రావడంలాంటివి ప్రత్యేకమైనవి. ఇక ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించడం అంటే అది అల్టిమేట్‌" అని రవిశాస్త్రి అన్నాడు.

ఆ తర్వాత కొన్నాళ్లకు జరిగిన మరో సంఘటన గురించి కూడా రవిశాస్త్రి వివరించాడు. "కొన్నేళ్ల తర్వాత నేను జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో హాలీడే కోసం వెళ్లాను. అక్కడి స్థానిక బీర్‌ తాగుతూ కూర్చున్నాను. ఇంతలో వాయవ్య పాకిస్థాన్‌ లేదా ఆఫ్ఘనిస్థాన్‌ పఠాన్‌ అనుకుంటాను.. నా దగ్గరికి వచ్చాడు. శాస్త్రీ జీ ఆ కారు ఎలా ఉంది? అని అడిగాడు. చాలా బాగుంది అని నేను చెప్పాను. ఆ కారుకున్న ప్రాముఖ్యత అదీ" అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

<p>రవిశాస్త్రి రీస్టోర్ చేయించిన 1985 నాటి తన ఆడి కారు ఇదే</p>
రవిశాస్త్రి రీస్టోర్ చేయించిన 1985 నాటి తన ఆడి కారు ఇదే (Nitin Lawate)
WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్