Pakistan Team Coach: ప్రపంచ క్రికెట్‌లో తొలిసారి.. పాకిస్థాన్ టీమ్‌కు ఆన్‌లైన్ కోచ్!-pakistan team coach mickey arthur may train them online ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pakistan Team Coach: ప్రపంచ క్రికెట్‌లో తొలిసారి.. పాకిస్థాన్ టీమ్‌కు ఆన్‌లైన్ కోచ్!

Pakistan Team Coach: ప్రపంచ క్రికెట్‌లో తొలిసారి.. పాకిస్థాన్ టీమ్‌కు ఆన్‌లైన్ కోచ్!

Hari Prasad S HT Telugu
Jan 30, 2023 05:33 PM IST

Pakistan Team Coach: ప్రపంచ క్రికెట్‌లో తొలిసారి పాకిస్థాన్ టీమ్‌కు ఆన్‌లైన్ కోచ్ వస్తున్నాడట. ఈ విషయాన్ని పాకిస్థాన్ మీడియా ప్రముఖంగా చెబుతోంది. ఆ కోచ్ పేరు మిక్కీ ఆర్థర్.

మిక్కీ ఆర్థర్
మిక్కీ ఆర్థర్

Pakistan Team Coach: మిక్కీ ఆర్థర్.. ప్రపంచ క్రికెట్ లోని సక్సెస్ ఫుల్ కోచ్ లలో ఒకడు. కోచ్ గా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంకలాంటి జట్లకు అంతర్జాతీయ క్రికెట్ లో మంచి సక్సెస్ సాధించి పెట్టాడు. గతంలో పాకిస్థాన్ టీమ్ కు కూడా కోచ్ గా వ్యవహరించాడు. అయితే ఇప్పుడు మరోసారి అతనికే కోచింగ్ అవకాశం ఇవ్వాలని పాక్ బోర్డు భావిస్తోంది.

అయితే ఈసారి ఆర్థర్ పూర్తిగా పాక్ టీమ్ తో ఉండేది అనుమానం కనిపిస్తోంది. అతడు ఆన్‌లైన్ లో కోచింగ్ ఇచ్చే అవకాశం ఉందని పాక్ మీడియా చెబుతోంది. చాలా వరకూ ఆన్‌లైన్ కోచింగ్ కే పరిమితమయ్యే మిక్కీ ఆర్థర్.. అప్పుడప్పుడూ టీమ్ తో చేరతాడని వెల్లడించింది. అయితే ఈ ఏడాది చివర్లో ఇండియాలో జరగబోయే వరల్డ్ కప్ కు మాత్రం ఆర్థర్ టీమ్ తోనే ఉంటాడని తెలిపింది.

ప్రస్తుతం మిక్కీ ఆర్థర్ డెర్బీషైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కు ఫుల్ టైమ్ కోచ్ గా ఉన్నాడు. ఇప్పుడు పాక్ టీమ్ కోచ్ పదవి దక్కిన తర్వాత కూడా అతడు అక్కడే కొనసాగనున్నాడు. ఆర్థర్ కు ఓ అసిస్టెంట్ ను పాక్ క్రికెట్ బోర్డు నియమించనుంది. ఆ అసిస్టెంట్ కోచ్ మాత్రం ఎప్పుడూ పాక్ టీమ్ తోనే ఉంటాడు. 2022 సీజన్ కు ముందు ఆర్థర్ డెర్బీషైర్ కోచ్ గా వెళ్లాడు.

ఆ టీమ్ కూడా అతని ఆధ్వర్యంలో దూసుకెళ్లింది. వైటాలిటీ బ్లాస్ట్ టోర్నీ గ్రూప్ స్టేజ్ లో ఏకంగా 9 విజయాలతో కొత్త రికార్డు కూడా సొంతమైంది. అలాంటి కోచ్ ను పాకిస్థాన్ కు మరోసారి తీసుకురావాలని అక్కడి బోర్డు గట్టిగా భావిస్తోంది. ఈ మధ్యే బోర్డు అధ్యక్షుడు నజమ్ సేఠీ కూడా ఇదే విషయం చెప్పారు.

"నేను నేరుగా మిక్కీతోనే చర్చలు జరుపుతున్నాను. ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి. చాలా విషయాలపై చర్చించాం. త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతాం. మిక్కీ వస్తే తన టీమ్ ను తాను తయారు చేసుకుంటాడు. మేము కేవలం ఎంత ఇవ్వాలన్నది నిర్ణయించాల్సి ఉంటుంది. 2-3 రోజుల్లో ఆ పని పూర్తవుతుంది" అని నజమ్ సేఠీ వెల్లడించారు.

WhatsApp channel

టాపిక్