Babar Azam: మరో వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్ చేసిన పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్‌-pakistan captain babar azam creates new world record ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Babar Azam: మరో వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్ చేసిన పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్‌

Babar Azam: మరో వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్ చేసిన పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్‌

Hari Prasad S HT Telugu
Jun 11, 2022 09:08 AM IST

పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం ఈ మధ్య ఓ మ్యాచ్‌ ఆడినప్పుడల్లా ఏదో ఒక రికార్డును తన పేరిట రాసుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో బాబర్‌ మరో వరల్డ్‌ రికార్డు క్రియేట్ చేశాడు.

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం (AP)

ముల్తాన్‌: కొన్నాళ్ల కిందటి వరకూ క్రికెట్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టించిన ఘనత టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లిది. కానీ అతడు ఫామ్‌ కోల్పోవడంతో ఇప్పడతని స్థానాన్ని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌, పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం భర్తీ చేస్తున్నారు. టెస్టుల్లో రూట్‌, వన్డేల్లో బాబర్‌ దూకుడు కొనసాగుతోంది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో సెంచరీ చేసిన బాబర్‌.. ఈ క్రమంలో అత్యంత వేగంగా 1000 రన్స్‌ చేసిన కెప్టెన్‌గా కోహ్లి రికార్డును బ్రేక్‌ చేశాడు.

ఇప్పుడు రెండో వన్డేలో సెంచరీ చేయకపోయినా.. వరల్డ్ రికార్డ్‌ను తన పేరిట రాసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు 93 బాల్స్‌లో 77 రన్స్‌ చేశాడు. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో బాబర్‌కు ఇది వరుసగా 9వ ఫిఫ్టీ ప్లస్‌ స్కోరు కావడం విశేషం. గతంలో ఏ ఇతర బ్యాటర్‌కూ సాధ్యం కాని రికార్డు ఇది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో 196 రన్స్‌ చేయడంతో బాబర్‌ ఫిఫ్టీ ప్లస్‌ స్కోరు పరంపర మొదలైంది.

ఆ తర్వాత మూడో టెస్ట్‌లో వరుసగా 66, 55 స్కోర్లు చేశాడు. ఆస్ట్రేలియాతోనే జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో బాబర్‌ రెండు సెంచరీలు చేశాడు. మొత్తంగా 57, 114, 105 నాటౌట్‌ స్కోర్లతో ఆ సిరీస్‌ ముగించాడు. ఇక ఆస్ట్రేలియాతోనే జరిగిన ఏకైక టీ20లో అతడు 66 రన్స్‌ చేశాడు. ఇక ఇప్పుడు వెస్టిండీస్‌తో ఇప్పటి వరకూ రెండు వన్డేలు జరగగా.. తొలి వన్డేలో సెంచరీ, రెండో వన్డేలో 77 రన్స్‌ చేయడం విశేషం.

ఈ క్రమంలో వన్డేల్లో కెప్టెన్‌గా కేవలం 13 ఇన్నింగ్స్‌లోనే 1000 రన్స్‌ చేసిన అరుదైన ఘనతను బాబర్‌ సొంతం చేసుకున్నాడు. బాబర్‌ దూకుడుతో రెండో వన్డేలోనూ వెస్టిండీస్‌పై గెలిచిన పాకిస్థాన్‌ సిరీస్‌ ఎగరేసుకుపోయింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 275 రన్స్‌ చేసింది. ఆ తర్వాత చేజింగ్‌లో వెస్టిండీస్‌ కేవలం 155 రన్స్‌కే కుప్పకూలింది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్