Suresh raina | ధోనీ నమ్మకాన్ని రైనా కోల్పోయాడు.. కివీస్ మాజీ సంచలన వ్యాఖ్యలు-new zealand former cricketer simon doull says raina lost loyalty of ms dhoni ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  New Zealand Former Cricketer Simon Doull Says Raina Lost Loyalty Of Ms Dhoni

Suresh raina | ధోనీ నమ్మకాన్ని రైనా కోల్పోయాడు.. కివీస్ మాజీ సంచలన వ్యాఖ్యలు

HT Telugu Desk HT Telugu
Feb 17, 2022 01:08 PM IST

సురేశ్ రైనాను ఐపీఎల్‌లో సీఎస్కే కొనుగోలు చేయకపోవడంపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ స్పందించారు. అతను ఎంఎస్ ధోనీ విశ్వాసాన్ని కోల్పోయాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రైనాపై సైమన్ డౌల్ వ్యాఖ్యలు
రైనాపై సైమన్ డౌల్ వ్యాఖ్యలు (Twitter)

భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనాను గత వారం రెండ్రోజుల పాటు జరిగిన ఐపీఎల్ వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడంపై క్రికెట్ సమాచారం విస్తుపోయింది. టీ20 క్రికెట్‌లో తనదైన మార్కు ఆటతో ఆడే రైనాను పక్కన పెట్టడం చాలా మందిని ఆశ్చర్యాన్ని గురి చేసింది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్న సురేశ్ రైనాను.. ఈ వేలానికి ముందే ఆ జట్టు వదులుకుంది. అయితే ఈ అంశంపై న్యూజిలాండ్ మాజీ ఆటగాడు సైమన్ డౌల్ స్పందించారు. అతను(రైనా) ఎంఎస్ ధోనీ విశ్వాసాన్ని కోల్పోయాడని వ్యాఖ్యానించారు.

సురేశ్ రైనాను ఐపీఎల్‌లోకి తీసుకోకపోవడానికి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. అతను జట్టు విధేయతను కోల్పోయాడు. ముఖ్యంగా ఎంఎస్ ధోనీ విశ్వాసాన్ని కోల్పోయాడు. ఒకసారి అలాంటి గుర్తింపు వచ్చిందంటే మళ్లీ తిరిగి రావడం కష్టమే. అని సైమన్ ఓ ఇంటర్వ్యూలో రైనా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున సురేశ్ రైనా ఆడుతున్నాడు. 2016,2017(గుజరాత్ సూపర్ జెయింట్స్) మినహా మిగిలిన అన్ని సీజన్లలోనూ ఆ జట్టుకే ప్రాతినిధ్యం వహించాడు. చెన్నైపై నిషేధం విధించిన కారణంగా ఆ సమయంలో గుజరాత్‌కు ఆడాడు. 2020లో వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్‌కు దూరమయ్యాడు. గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్‌గా అవతరించినప్పటికీ సురేశ్ రైనా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. పేలవ ఫామ్‌తో జట్టుకు భారమయ్యాడు. ఈ కారణంగా ఐపీఎల్ వేలానికి ముందే రైనాను చెన్నై సూపర్ కింగ్స్ వదులుకుంది.

<p>ఎంఎస్ ధోనీ</p>
ఎంఎస్ ధోనీ (ANI)

ఇన్ని రోజులు చెన్నై జట్టు తరఫున రైనా ఆడటానికి ప్రధాన కారణం ఎంఎస్ ధోనీ అతనిపై అతిగా నమ్మకం ఉంచడమేనని ఇప్పటికే పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. రైనా కూడా ధోనీ పట్ల అంతే విధేయతను కనబరుస్తూ వచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన రోజే రైనా కూడా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.

మొత్తంగా ఐపీఎల్‌లో సురేశ్ రైనా 205 మ్యాచ్‌లు ఆడి 5,528 పరుగుల చేశారు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రైనా నాలుగో స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు నాలుగు సార్లు ఐపీఎల్ విజేతగా నిలువగా.. ప్రతి సారీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

సీఎస్కే మరోసారి వేలంలో బలమైన జట్టును తయారు చేసుకుంది. డ్వేన్ బ్రేవో, దీపక్ చాహర్. రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు లాంటి స్టార్లతో బలంగా ఉంది. అంతేకాకుండా ఐపీఎల్ వేలానికి ముందే ధోనీతో పాటు రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, రవీంద్ర జడేజాను ఉంచుకుంది.

WhatsApp channel

సంబంధిత కథనం