Dhoni | జెర్సీ నెంబరుగా '7'నే మహీ ఎంచుకోవడానికి కారణం ఏంటి? మూఢనమ్మకమా?-ms dhoni reveals reason behind his iconic jersey number 7 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ms Dhoni Reveals Reason Behind His Iconic Jersey Number 7

Dhoni | జెర్సీ నెంబరుగా '7'నే మహీ ఎంచుకోవడానికి కారణం ఏంటి? మూఢనమ్మకమా?

Maragani Govardhan HT Telugu
Mar 17, 2022 05:10 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ జెర్సీ నెంబరు 7 అని క్రికెట్ చూసే ప్రతి ఒక్కరూ చెప్పేయగలుగుతారు. కానీ ఆయన ఆ నెంబరు తీసుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ విషయాన్నే మిస్టర్ కూల్ ధోనీ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

ధోనీ జెర్సీ నెంబర్ 7
ధోనీ జెర్సీ నెంబర్ 7 (twitter)

సంఖ్యాశాస్త్రాన్ని(Numerology) చాలామంది విశ్వసిస్తుంటారు. అందులోనూ ప్రధానంగా సెలబ్రెటీలు ఎక్కువగా నమ్ముతుంటారు. అందుకే చాలా విషయాల్లో తమకిష్టమైన లేదా తమ అచ్చొచ్చే నెంబరును సెంటిమెంటుగా ఉపయోగిస్తుంటారు. కారు, ఫోన్, ఇల్లు ఇలా ఒకటేమిటి సంఖ్యల ఆధారంగా గుర్తింపు ఉండే ప్రతి వాటిపై తమకు అదృష్టాన్నిచ్చే నెంబరును వాడుతుంటారు. క్రికెట్‌లో అయితే జెర్సీ నెంబర్లను సెంటిమెంటుగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(Mahendrasingh Dhoni) కూడా తన జెర్సీ నెంబరుగా(Jersey number) 7 ను ఉపయోగించేవారు. అయితే అతడు కూడా అదృష్ట సూచికగానో లేదా మూఢనమ్మకంగానో ఈ నెంబరును వాడారనుకుంటే మీరు పొరబడినట్లే. ఈ సంఖ్యను ఉపయోగించడానికి కారణం వేరే ఉందటున్నారు మన మిస్టర్ కూల్.

ట్రెండింగ్ వార్తలు

"మొదట్లో చాలా మంది '7' నా లక్కీ నెంబరని, నాకు బాగా కలిసొచ్చిన సంఖ్య అని అనుకునేవాళ్లు. కానీ అలా కాదు. దీనికి చాలా సింపుల్ కారణం ఉంది. నేను పుట్టింది జులై 7వ తేదీన. అంటే ఏడో నెలలో ఏడో తారీఖున జన్మించాను. కాబట్టి 7 నెంబరు ప్రత్యేకంగా భావించాను. అంతేకాకుండా ఏ సంఖ్య మంచిది అని ఆలోచించుకునే బదులు.. నేను పుట్టిన తేదీనే ఉపయోగించడం మంచిదని జెర్సీ నెంబరుగా 7ను తీసుకున్నాను. ప్రజలు ఇదే విషయాన్ని అడిగినప్పుడు కూడా నేను పుట్టింది 81లో అంటే 8 నుంచి 1 తీసివేస్తే 7 వస్తుందని చెప్పాను. అంతేకాకుండా చాలా మంది 7 తటస్థ సంఖ్య అని మీకు కలిసిరాకపోయినా.. వ్యతిరేకంగా అయితే ఉండదని చెప్పారు. ఏదిఏమైనా ఆ సంఖ్యపై నాకు ఎలాంటి మూఢనమ్మకం లేదు. నా హృదయానికి దగ్గరగా ఉన్న నెంబర్ అది. అందుకే జెర్సీపై ఆ నెంబరును ఉంచుకున్నా." అని మహీ.. చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఇండియా సిమెంట్స్‌కు ఇచ్చిన వర్చవల్ ఇంటర్వ్యూలో చెప్పారు.

2007 నుంచి ధోనీ తన జెర్సీపై 7 నెంబరును ఉపయోగిస్తూ వచ్చాడు. అప్పటి నుంచి రిటైరయ్యేంత వరకు కూడా ఇదే నెంబరు వాడాడు. అంతేకాకుండా ప్రస్తుతం ఐపీఎల్‌లోనూ ఇదే నెంబరును ఉపయోగిస్తున్నాడు. త్వరలో ఐపీఎల్ 2022 ఆరంభం కానున్న తరుణంలో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన చెన్నైను మరోసారి విజేతగా నిలపాలని మన మిస్టర్ కూల్ తాపత్రయపడుతున్నారు. మార్చి 26న ముంబయిలో వాఖండే వేదికగా గతేడాది రన్నరప్ అయిన కోల్‌కతాతో చెన్నై తలపడుతూ సీజన్‌ను ఘనంగా ఆరంభించనుంది.

ఐపీఎల్ ఆరంభానికి ముందు గత వారం రోజులుగా ధోనీ సురత్‌లో శిక్షణ పొందుతున్నారు. అక్కడ సౌకర్యాల పట్లు సంతృప్తి వ్యక్తం చేశాడు. సూరత్‌ను ప్రీ సీజన్‌ శిక్షణా శిభిరంగా ఎంచుకున్నాడు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్