MI vs LSG: ఎలిమినేటర్ అడ్డంకిని లక్నో దాటుతుందా? - ముంబై జోరు కొనసాగుతుందా?
MI vs LSG: బుధవారం (నేడు) ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్‌తో తలపడుతుంది.
MI vs LSG: ఐపీఎల్ 2023లో భాగంగా బుధవారం (నేడు) చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది. ఓడిన టీమ్ ఐపీఎల్ నుంచి నిష్క్రమిస్తుంది. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ముంబై, లక్నో మూడు సార్లు తలపడ్డాయి. ఈ మూడు మ్యాచుల్లో లక్నో విజయాన్ని సాధించింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమితో అదృష్టం కలిసిరావడంతో ముంబై ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఈ లక్కీ ఛాన్స్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో ముంబై ఉంది. బ్యాటింగ్ పరంగా ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్‌గానే ఉన్నా ఆటగాళ్లు సమిష్టిగా రాణించకపోవడమే సమస్యగా మారుతోంది.
సూర్యకుమార్, గ్రీన్...
ఒక్కో మ్యాచ్‌లో ఒక్కొక్కరు చెలరేగుతోన్నారు. కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లపైనే ముంబై బ్యాటింగ్ ఆశలు ఎక్కువగా ఉన్నాయి. కెప్టెన్‌రోహిత్ శర్మ ఇప్పటివరకు జట్టుకు ఉపయోగపడే భారీ ఇన్నింగ్స్ ఆడలేదు. రోహిత్ రాణించాలని ముంబై ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
బౌలింగ్ పరంగా వెటరన్ స్పిన్నర్ పీయూష్ చావ్లా ఒక్కడే నిలకడగా రాణిస్తోన్నాడు. మిగిలిన బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడం ముంబైని కలవరపెడుతోంది. ఈ సమస్యను నేటి మ్యాచ్‌లో ముంబై ఏ మేరకు అధిగమిస్తుందో చూడాల్సిందే.
గత సీజన్‌లో...
మరోవైపు గత సీజన్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన లక్నో టీమ్ తొలి ప్రయత్నంలోనే ప్లేఆఫ్స్‌కు చేరుకున్నది. గత సీజన్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌లోనే ఓటమి పాలై కప్‌కు దూరమైంది.
ఈ సారి ఆ అడ్డంకిని అధిగమించాలనే పట్టుదలతో ఉంది. డికాక్, మేయర్స్, పూరన్, స్టోయినిస్ వంటి హిట్టర్లతో లక్నో బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. ఇందులో ఏ ఒక్కరు చెలరేగినా ముంబైకి కష్టాలు తప్పవు. బౌలింగ్‌లోనూ రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, మోసిన్‌ఖాన్ ఆకట్టుకుంటోన్నారు.