Dinesh Karthik: వరల్డ్‌కప్ గెలవాలని అనుకుంటే అతన్ని ఎంపిక చేయండి: స్టెయిన్
టీమిండియాలో కొత్త స్టార్ అయిపోయాడు దినేష్ కార్తీక్. ఇప్పుడు అందరి కళ్లూ అతనిపైనే. ఒక విధంగా చెప్పాలంటే ధోనీ, విరాట్ కోహ్లిలాంటి ప్లేయర్స్‌కు ఉన్న ఫాలోయింగ్‌ను అతడు సొంతం చేసుకుంటున్నాడు.
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 దినేష్ కార్తీక్ జీవితాన్నే మార్చేసింది. అతనిపై నమ్మకం ఉంచి భారీ మొత్తానికి కొనుగోలు చేసిన ఆర్సీబీ.. పూర్తిగా తెరమరుగైన కార్తీక్‌ను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. ఐపీఎల్ ఫామ్ చూసి తనను ఎంపిక చేసిన సెలక్టర్ల నమ్మకాన్ని కూడా కార్తీక్ నిలబెట్టుకుంటున్నాడు. తన ఫినిషర్ రోల్‌కు సరైన న్యాయం చేస్తూ నాలుగో మ్యాచ్‌లో తన కెరీర్‌లో తొలి టీ20 ఇంటర్నేషనల్ హాఫ్ సెంచరీ చేశాడు.
ట్రెండింగ్ వార్తలు
దీంతో అతడు కచ్చితంగా టీ20 వరల్డ్‌కప్‌లో ఉండాల్సిందే అన్న డిమాండ్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అతని వయసు కాదు.. ఆట చూసి ఎంపిక చేయాల్సిందే అని ఇప్పటికే లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పష్టం చేయగా.. ఇప్పుడు సౌతాఫ్రికా మాజీ బౌలర్ డేల్ స్టెయిన్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్లేయర్స్ పేరు చూసి కాదు.. ఫామ్ చూసి ఎంపిక చేస్తేనే వరల్డ్‌కప్ గెలుస్తారని స్పష్టం చేశాడు.
ఈఎస్పీఎన్ క్రికిక్ఫోతో మాట్లాడుతూ.. ఇదే ఫామ్ కార్తీక్ కొనసాగిస్తే టీ20 వరల్డ్‌కప్ టీమ్‌లో ఉండబోయే తొలి వ్యక్తి అతడే అని స్టెయిన్ అన్నాడు. "ప్రతిసారీ డీకే తానెంతటి క్లాస్ ప్లేయర్‌నో నిరూపిస్తూనే ఉన్నాడు. ఒకవేళ వరల్డ్‌కప్ గెలవాలని అనుకుంటే ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ను ఎంపిక చేయాలి. కొందరు ప్లేయర్స్‌ను కేవలం పేరు చూసి ఎంపిక చేస్తుంటారు. కానీ కార్తీక్ ఉన్న ఫామ్ చూడండి. అతడు ఇలాగే ఆడితే.. వరల్డ్‌కప్ టీమ్‌లో ఉండే తొలి ప్లేయర్ అతడే అవుతాడు" అని స్టెయిన్ అభిప్రాయపడ్డాడు.
కార్తీక్ ప్రతి మ్యాచ్‌కు మరింత మెరుగవుతున్నాడని, తన గేమ్‌ను బాగా అర్థం చేసుకుంటున్నాడని స్టెయిన్ చెప్పాడు. "డీకే అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది మ్యాచ్ మ్యాచ్‌కూ మెరుగవుతున్నాడు. అతనికి వికెట్ కీపర్ మెంటాలిటీ ఉంది. గేమ్‌ను సరిగ్గా చదవగలడు. బౌలర్ ఏం చేయాలనుకుంటున్నాడో పసిగట్టగలడు. దానిని తన నైపుణ్యంతో చిత్తు చేయగలడు. అతడు స్వీప్, రివర్స్ స్వీప్, ల్యాప్ షాట్లు ఆడగలడు. ఇవన్నీ గేమ్‌ను బాగా చదివి, అర్థం చేసుకునే వాళ్లే ఆడగలరు" అని స్టెయిన్ అన్నాడు. బౌలర్ వేసిన తొలి బంతికే బౌండరీ బాది వాళ్లను ఒత్తిడిలోకి నెట్టగలడని చెప్పాడు.
సంబంధిత కథనం