Hanuma Vihari Batting Broken Wrist:ఆ మ్యాచ్ తర్వాత క్రికెట్ ఆడకపోయినా పర్లేదు అనుకున్నా - విహారి కామెంట్స్ వైరల్
Hanuma Vihari Batting Broken Wrist: మధ్యప్రదేశ్‌తో జరిగిన రంజీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విరిగిన మణికట్టుతోనే బ్యాటింగ్ చేసి క్రికెట్ అభిమానుల మనసుల్ని గెలుచుకున్నాడు హనుమ విహారి. గాయం కారణంగా ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ దిగడం రిస్క్ అని ఫిజియో హెచ్చరించినా జట్టుకోసమే అలా చేయాల్సివచ్చిందని హనుమ విహారి పేర్కొన్నాడు.
Hanuma Vihari Batting Broken Wrist: ఇటీవల మధ్య ప్రదేశ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఒంటి చేతితో బ్యాటింగ్ చేసి క్రికెట్ అభిమానుల మన్ననల్ని అందుకున్నాడు ఆంధ్రా క్రికెటర్ హనుమ విహారి.
ట్రెండింగ్ వార్తలు
మధ్య ప్రదేశ్ పేసర్ ఆవేశ్ ఖాన్ బౌన్సర్ బలంగా తలగడంతో హనుమ విహారి కుడి చేయి మణికట్టు ఫ్రాక్చర్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉండటంతో గాయాన్ని లెక్క చేయకుండా చివరి బ్యాట్స్‌మెన్‌గా బరిలో దిగిన విహారి 27 పరుగులు చేశాడు.
లెఫ్ట్ హ్యాండ్‌తో అతడు బ్యాటింగ్ చేసిన తీరు అభిమానుల మనసుల్ని గెలుచుకున్నది. ఈ మ్యాచ్‌లో ఆంధ్రా ఓటమి పాలవ్వడంతో విహారి పోరాటం వృథాగా మారింది.
ఈ మ్యాచ్‌లో తాను బ్యాటింగ్ దిగే ముందు కెరీర్ రిస్క్‌లో పడే అవకాశం ఉందని ఫిజియో పది సార్లు హెచ్చరించాడని హనుమ విహారి అన్నాడు. మరోసారి చేయి దెబ్బ తగిలితే ఎప్పటికీ క్రికెట్ ఆడలేవని అన్నాడని విహారి తెలిపాడు. రంజీ ట్రోఫీలో ఆంధ్రాకు ఎంతో ముఖ్యమైన మ్యాచ్ ఇదని తెలిపాడు. అందుకే ఈ మ్యాచ్ తర్వాత మరోసారి క్రికెట్ ఆడకపోయినా పర్లేదనే ధైర్యంతో బ్యాటింగ్‌కు దిగానని హనుమ విహారి అన్నాడు.
పది పరుగులు చేసినా టీమ్‌కు అది అడ్వాంటేజ్‌గా మారుతుందనే నమ్మకంతోనే ధైర్యంగా బ్యాటింగ్ చేశానని విహారి చెప్పాడు. కానీ ఈ మ్యాచ్‌లో ఆంధ్రా ఓడిపోవడం బాధను కలిగించిందని విహారి పేర్కొన్నాడు. ఈ రంజీ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 93 పరుగులకే ఆలౌటైంది. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 228, రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులు చేసి విజయాన్ని అందుకున్నది.
టాపిక్