Fifa world cup 2022 : నేటి నుంచే ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌.....-fifa world cup 2022 league will start today evening in qatar at 730pm ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Fifa World Cup 2022 League Will Start Today Evening In Qatar At 7.30pm

Fifa world cup 2022 : నేటి నుంచే ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌.....

HT Telugu Desk HT Telugu
Nov 20, 2022 08:35 AM IST

Fifa world cup 2022 ప్రపంచ ఫుట్‌బాల్‌ కప్‌ పోటీలకు సర్వం సిద్ధమైంది. 29 రోజుల పాటు 32 జట్లు.. 64 మ్యాచ్‌లలో పాల్గొననున్నాయి. తొలి మ్యాచ్‌లో ఖతార్‌-ఈక్వెడార్‌ జట్ల మధ్య ఆదివారం రాత్రి 9.30 నుంచి మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ప్రపంచ ఫుట్‌ బాల్ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు సర్వం సిద్ధమైంది. ప్రపంచ సాకర్ కప్‌ పోటీల నిర్వహణ కోసం ఖతార్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ప్రపంచ ఫుట్ బాల్ కప్  పోటీల కోసం ముస్తాడైన ఖతార్ వీధులు
ప్రపంచ ఫుట్ బాల్ కప్ పోటీల కోసం ముస్తాడైన ఖతార్ వీధులు (REUTERS)

Fifa world cup 2022ప్రపంచంలోనే అతి పెద్ద స్పోర్ట్స్‌ ఈవెంట్లలో ఒకటైన ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు రంగం సిద్ధమైంది. ఖతార్‌ వేదికగా మెగా టోర్నీ శ్రీకారం చుట్టుకుంటోంది. దోహాలోని అధునాతన స్టేడియంలో తొలి రోజు ఆతిథ్య జట్టు ఖతార్‌.. గ్రూప్‌-ఎలో ఈక్వెడార్‌‌తో తలపడనుంది. ఇప్పటి దాకా ఎన్నడూ ప్రపంచ కప్‌లో ఆడేందుకు అర్హత సాధించని ఖతార్‌, ఆతిథ్య హోదాలో ఈసారి అవకాశం దక్కించుకుంది. నెదర్లాండ్స్‌, సెనగల్‌ కూడా ఉన్న ఈ గ్రూప్‌లో ఖతార్‌ జట్టుపై భారీ అంచనాలు ఏమి లేవు. ఈక్వెడార్‌ కూడా బలహీన జట్టే అయినా, ఫుట్‌బాల్‌లో పసికూన వంటి ఖతార్‌ను ఓడించడం ఆ జట్టుకు కష్టం కాకపోవచ్చనే అభిప్రాయం ఉంది.

సాకర్‌ ప్రపంచకప్‌లో 32 జట్లు పోటీ పడుతున్నాయి. వీటిని 8 గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కోదాంట్లో నాలుగు జట్లు ఉన్నాయి. ప్రతి జట్టూ మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి. నాకౌట్‌ బెర్తుల కోసం తీవ్రమైన పోటీ ఉన్న దాన్ని 'గ్రూప్‌ ఆఫ్‌ డెత్‌'గా పేర్కొంటుంటారు. ఈసారి అలాంటి గ్రూప్‌లు రెండున్నాయి. గ్రూప్‌-బిలో మాజీ ఛాంపియన్‌ జట్టు ఇంగ్లాండ్‌తో పాటు అమెరికా, వేల్స్‌ కూడా నాకౌట్‌కు గట్టి పోటీదారులుగా ఉన్నాయి. ఇరాన్‌ అవకాశాలను కూడా బలంగానే ఉన్నాయి. గ్రూప్‌-ఈలోనూ పోటీ గట్టిగానే ఉంది. స్పెయిన్‌, జర్మనీ నాకౌట్‌ బెర్తులకు ఫేవరెట్లుగా ఉన్నా, కోస్టారికా లాంటి ప్రమాదకర జట్టు కూడా ఆ గ్రూప్‌లో ఉంది. జపాన్‌ జట్టులో ప్రతిభావంతులు ఉన్నా మిగిలిన జట్లతో పోలిస్తే బలహీనంగానే ఉంది.

టైటిల్ దక్కేది ఎవరికి....?

ప్రపంచకప్‌లో టైటిల్‌ ఫేవరెట్‌గా ఎక్కువమంది బ్రెజిల్‌ జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.నిజానికి ఇరవై ఏళ్లుగా అంటే 2002లో రికార్డు స్థాయిలో అయిదో ప్రపంచకప్‌ను సాధించాక, బ్రెజిల్ సాకర్‌ జట్టు మళ్లీ కప్పు గెలవలేదు. 2014లో సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌లోనూ ఓడిపోయింది. గత రెండేళ్లలో బ్రెజిల్‌ ఫామ్‌ను బట్టి చూస్తే ఈసారి కప్పు గెలిచే అవకాశాలు బలంగానే ఉన్నాయి. నెయ్‌మార్‌కు తోడు మిగతా బ్రెజిల్‌ స్టార్లు కూడా ఫామ్‌లోనే ఉన్నారు. నాకౌట్‌లో పరిస్థితులను అధిగమిస్తే ఆ జట్టు 20 ఏళ్ల విరామం తర్వాత కప్పు గెలవొచ్చు. బ్రెజిల్‌ తర్వాత ఎక్కువ అవకాశాలు అర్జెంటీనాకే ఉన్నాయి.. 2014లో జట్టును టైటిల్‌కు అత్యంత చేరువగా తీసుకెళ్లిన మెస్సి, తనకు చివరిదిగా భావిస్తున్న ప్రపంచకప్‌లో కల నెరవేర్చుకోవడానికి ప్రయత్నించనున్నాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ను మరోసారి టైటిల్‌కు గట్టి పోటీదారుగా పరిగణిస్తున్నారు.

ప్రపంచకప్‌ సాకర్‌ పోటీలలో కొత్త స్టార్లు పుట్టుకురావడం సాధారణమే..., గత ప్రపంచకప్‌లో ఫ్రాన్స్‌ యువ ఆటగాడు ఎంబాపె పేరు మార్మోగింది. ఈసారి ప్రపంచకప్‌లో అంచనాలున్న యువ ఆటగాళ్లు కొందరున్నారు. స్పెయిన్‌ ఆటగాడు పెడ్రిపై మంచి అంచనాలు ఉన్నాయి. బార్సిలోనా తరపున అదరగొట్టిన 19 ఏళ్ల కుర్రాడిని తర్వాతి 'ఇనియెస్టా'గా పేర్కొంటున్నారు. 2017లో 17 ఏళ్ల వయసులోనే 46 మిలియన్‌ యూరోలకు రియల్‌ మాడ్రిడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న బ్రెజిల్‌ కుర్రాడు వినిసియస్‌.. ఖతార్‌లో అద్భుతాలు చేస్తాడని అంచనా వేస్తున్నారు. ఇక గతంలో ఇంగ్లాండ్‌కు ఆడి ఇప్పుడు జర్మనీకి ప్రాతినిధ్యం వహిస్తున్న 19 ఏళ్ల జమాల్‌ ముసియాలాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంగ్లాండ్‌ మిడ్‌ఫీల్డర్‌ బెలింగ్టన్‌, ఫ్రాన్స్‌ యువ కెరటం కమవింగా, పోర్చుగల్‌ కుర్రాడు నునో మెండిస్‌ కూడా ప్రపంచకప్‌లో చూడదగ్గ ఆటగాళ్లేనని చెబుతున్నారు.

ఆ ముగ్గురూ మాయ చేస్తారా?

ప్రపంచంలో దాదాపు 200 దేశాల్లో ఆదరణ ఉన్న ఫుట్‌బాల్‌ ఆట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచకప్‌ పోటీల్లో తమ జట్టు కప్పు గెలుస్తుందా అని ఉత్కంఠగా చూసే దేశాలు పది వరకు ఉన్నాయి. మిగతా దేశాలలో ప్రపంచకప్‌లో మేటి ఫుట్‌బాల్ క్రీడాకారుల విన్యాసాల కోసం టోర్నీని వీక్షిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకర్షించే సమ్మోహన శక్తి ఉన్న ఆటగాళ్లు కొద్దిమందే ఉన్నారు. ఈ ప్రపంచకప్‌‌లో రొనాల్డో, మెస్సి, నెయ్‌మార్‌ల గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. ముగ్గురూ అంతర్జాతీయ స్థాయిలో, క్లబ్‌ ఫుట్‌బాల్‌లో ఎన్నో ఘనతలు సాధించినా ముగ్గురికీ ప్రపంచ కప్పు కల నెరవేరలేదు.

రొనాల్డో మేటి ఆటగాడే అయినా అతడి జట్టు పోర్చుగల్‌కు కప్పు గెలిచేంత స్థాయి లేదు. పోర్చుగల్‌ ఆడుతుంటే ఫుట్‌బాల్‌ ప్రపంచం మొత్తం దృష్టి రొనాల్డో మీద ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ ఫుట్‌బాల్‌ చరిత్రలోనే అత్యధిక గోల్స్‌ సాధించిన ఆటగాడు అతనే. రికార్డుల్లో అతడికి చేరువగానే ఉన్న మెస్సి.. ఆటతో చేసే మాయాజాలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతడి జట్టు టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటి కావడంతో మరింతగా మెస్సి మీద దృష్టి ఉంటుంది. ఇక కచ్చితంగా కప్పు గెలుస్తుందని అంచనాలున్న బ్రెజిల్‌ జట్టుకు అతి పెద్ద ఆకర్షణ నెయ్‌మార్‌. ఆధునిక దిగ్గజాల్లో ఒకడిగా రూపుదిద్దుకుంటున్న నెయ్‌మార్‌ ప్రపంచకప్‌లో చేసే విన్యాసాల కోసం ఆసక్తిగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఖతార్‌‌కు అవకాశాలున్నాయా...?

పంచకప్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఖతార్‌కు బోలెడు సవాళ్లు ఎదురవుతున్నాయి. గత కొన్ని దశాబ్దాల్లో ఏ ప్రపంచకప్‌కూ లేని వ్యతిరేకత, విమర్శలు ఖతార్‌ టోర్నీ విషయంలో ఎదురవుతున్నాయి. వాతావరణ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎప్పుడూ జూన్‌-జులై నెలల్లో జరిగే టోర్నీని నవంబరు-డిసెంబరు నెలలకు వాయిదా వేయడంపై ముందు నుంచే వ్యతిరేకత ఉంది. దీనికితోడు స్టేడియాల్లో బీర్ల అమ్మకాన్ని నిషేధించడం, వస్త్రధారణ విషయంలో ఆంక్షలు విధించడంపై ఫుట్‌బాల్‌ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఫిఫా సైతం ఈ ఆంక్షలపై అసంతృప్తితో ఉంది.

రాత్రి 7.30 నుంచి పోటీలు….

భారత్‌ కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటల నుంచి ఈ వేడుకలు జరుగుతాయి. 60 వేల సామర్థ్యమున్న అల్‌ బేట్‌ స్టేడియంలో ఈ వేడుకలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో నోరా ఫతేహి, జంగ్‌కూక్‌, బ్లాక్‌ ఐ పీస్‌, రాబీ విలియమ్స్‌ తదితరులు తమ ప్రదర్శనతో ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు.ప్రపంచకప్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన టోర్నీ ఇదే. దీని కోసం ఖతార్‌ దాదాపు 220 బిలియన్‌ అమెరికా డాలర్లు ఖర్చు చేసిందని సమాచారం.

విజేతకు రూ.344కోట్ల బహుమతి…

ప్రపంచకప్‌లో విజేతగా నిలిచే జట్టుకు రూ.344కోట్ల నగదు బహుమతి అందు తుంది. రన్నరప్‌కు రూ.245 కోట్లు దక్కుతాయి. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు వరుసగా రూ.220 కోట్లు, రూ.204 కోట్లు సొంతం చేసుకుంటాయి. ఇప్పటివరకూ 21 ప్రపంచకప్‌లు జరగ్గా, కేవలం ఎనిమిది దేశాలు మాత్రమే కనీసం ఒక్కసారైనా విశ్వవిజేతగా నిలిచాయి. రికార్డు స్థాయిలో అత్యధికంగా అయిదు సార్లు బ్రెజిల్‌ కప్పు గెలుచుకుంది. ఇటలీ, జర్మనీ చెరో నాలుగు సార్లు ఛాంపియన్లుగా నిలిచాయి. ఉరుగ్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్‌ తలా రెండు సార్లు టైటిల్‌ దక్కించుకున్నాయి. ఇంగ్లాండ్‌, స్పెయిన్‌ ఒక్కోసారి కప్పును దక్కించుకున్నాయి. నాలుగేళ్లకోసారి జరిగే ప్రపంచకప్‌ 1930లో మొదలైంది.

WhatsApp channel