David Warner: 99పై వార్నర్‌ స్టంపౌట్‌.. వీవీఎస్‌ తర్వాత అతడే.. వీడియో-david warner stump out on 99 against sri lanka in fourth odi ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  David Warner Stump Out On 99 Against Sri Lanka In Fourth Odi

David Warner: 99పై వార్నర్‌ స్టంపౌట్‌.. వీవీఎస్‌ తర్వాత అతడే.. వీడియో

Hari Prasad S HT Telugu
Jun 22, 2022 11:23 AM IST

ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ 99 స్కోరుపై స్టంపౌట్‌ అయిన లిస్ట్‌లో చేరాడు. శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో అతనికి ఈ చేదు అనుభవం ఎదురైంది.

డేవిడ్ వార్నర్
డేవిడ్ వార్నర్ (AFP)

కొలంబో: ఓ బ్యాటర్‌ 90ల్లోకి ఎంటరయ్యాడంటే మూడంకెల స్కోరుపై ఎంతో ఆతృతగా ఉంటాడు. ఎలాంటి బ్యాటర్‌కైనా క్రికెట్‌లో సెంచరీ అనేది ఓ స్పెషల్‌ ఫీలింగ్‌. 90ల్లో ఔట్‌ అవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేరు. అలాంటిది 99పై ఔటైతే ఎలా ఉంటుంది? అందులోనూ అది స్టంపౌట్‌ కావడం మరీ దారుణం. కానీ ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో ఇదే అనుభవం ఎదురైంది.

ఈ మ్యాచ్‌లో 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వార్నర్‌ దూకుడుతో సులువుగా టార్గెట్ వైపు దూసుకెళ్తున్నట్లు కనిపించింది. పైగా అటు వార్నర్‌ కూడా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 48 ఇన్నింగ్స్‌లలో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఆ కరవు ఈసారి తీర్చుకోవడం ఖాయం అనిపించింది. అయితే అతడు స్పిన్నర్‌ ధనంజయ డిసిల్వా బౌలింగ్‌లో కాస్త ముందుకొచ్చి ఆడటానికి ప్రయత్నించాడు.

కానీ బంతి మిస్‌ కావడంతో వికెట్‌ కీపర్‌ వెంటనే వికెట్లను గిరాటేశాడు. దీంతో 99 స్కోరుపై వార్నర్‌ నిరాశగా పెవిలియన్‌ చేరాడు. వన్డేల్లో ఇలా 99 స్కోరుపై స్టంపౌట్‌ అయిన రెండో బ్యాటర్‌ వార్నర్‌. అతని కంటే ముందు ఇండియాకు చెందిన వీవీఎస్‌ లక్ష్మణ్‌ కూడా ఇలాగే 99పై స్టంపౌట్‌ అయ్యాడు. వార్నర్‌ ఔట్‌ కావడంతో మ్యాచ్‌ కూడా శ్రీలంక వైపు తిరిగింది. చివరికి ఆస్ట్రేలియా 4 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఈ మ్యాచ్‌తోపాటు సిరీస్‌ను కూడా శ్రీలంక గెలిచింది. 1992 తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై శ్రీలంకకు ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్‌ విజయం కావడం విశేషం. ఐదు వన్డేల సిరీస్‌లో మరో మ్యాచ్‌ మిగిలి ఉంది.

WhatsApp channel

టాపిక్