Chetan Sharma Resign: చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా
Chetan Sharma Resign: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేశాడు. ఇటీవలే ఓ స్టింగ్ ఆపరేషన్‌లో టీమ్ ఇండియా క్రికెటర్లతో పాటు బీసీసీఐ వ్యవహారశైలిలో చేతన్ శర్మ చేసిన కామెంట్స్ వివాదస్పదమయ్యాయి.
Chetan Sharma Resign: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది. ఇటీవలే ఓ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో దుమారం రేపాయి. అతడి కామెంట్స్‌పై బీసీసీఐ వర్గాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. చేతన్ శర్మ రాజీనామాను బీసీసీఐ సెక్రటరీ జైషా అంగీకరించినట్లు సమాచారం.
స్టింగ్ ఆపరేషన్‌లో క్రికెటర్స్ ఫిట్‌నెస్ కోసం ఇంజెక్షన్స్ వాడుతుంటారని చేతన్ శర్మ కామెంట్స్ చేశాడు. డోపింగ్ టెస్టులో పట్టుబడని ఇంజెక్షన్స్ అంటూ పేర్కొన్నాడు. అంతేకాకుండా టీమ్ ఇండియాలో రెండు వర్గాలు ఉన్నాయని, ఓ టీమ్‌కు రోహిత్ శర్మ లీడర్ అయితే మరో టీమ్‌కు విరాట్ కోహ్లి నాయకుడిగా ఉన్నాడంటూ చేతన్ శర్మ చెప్పాడు.
విరాట్ కోహ్లిని కెప్టెన్సీ పదవి నుంచి తప్పించే విషయంలో బీసీసీఐ కఠినంగా వ్యవహరించిందంటూ అనడం హాట్‌టాపిక్‌గా మారింది. అలాగే బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ, విరాట్ కోహ్లి విభేదాలపై చేతన్ శర్మ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. కెప్టెన్సీ పదవి నుంచి తొలగే సమయంలో విరాట్ కోహ్లి అబద్దం ఆడాడని చేతన్ శర్మ అన్నాడు.