Rishab Pant Salary : బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆడకపోయినా పంత్‌కు ఫుల్ శాలరీ
BCCI On Rishab Pant : రిషబ్ పంత్ కొద్ది రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. పూర్తిగా కోలుకునేందుకు ఇంకా సమయం పట్టనుంది. అయితే తాజాగా పంత్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
యువ క్రికెటర్ రిషబ్ పంత్(Rishab Pant) కొద్దిరోజుల కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ప్రస్తుతం ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్పెషల్ డాక్టర్స్ టీమ్ పంత్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. పంత్ డెహ్రాడూన్ లో ఉండగా.. అక్కడ నుంచి.. మెరుగైన వైద్య సదుపాయం కోసం ముంబయికి ఎయిర్ అంబులెన్స్ పెట్టి.. బీసీసీఐ(BCCI) తరలించింది.
రిషబ్ పూర్తిగా కోలుకునేందుకు ఇంకా 8 నెలల సమయం పట్టే అవకాశం ఉందని.. వైద్యులు అంటున్నారు. మళ్లీ క్రికెట్(Cricket) ఆడేందుకు ఏడాది పట్టే ఛాన్స్ ఉంది. త్వరగా కోలుకుని.. జట్టులో ఆట కొనసాగించాలని అందరూ కోరుకుంటున్నారు. పంత్ చికిత్సకు అయ్యే ఖర్చును బీసీసీఐ చూసుకుంటోంది. అయితే తాజాగా మరో నిర్ణయం కూడా తీసుకుంది. ఈ సీజన్ లో మ్యాచ్ లు ఆడకున్నా.. పంత్ కు పూర్తి జీతం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది.
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో గ్రేడ్ ఏ ప్రకారం.. పంత్ కు ఏటా రూ.5కోట్లు వస్తాయి. ప్రస్తుతం ఎలాంటి మ్యాచ్ ఆడకున్నా.. డబ్బులను చెల్లించనుంది. మరోవైపు ఐపీఎల్ లో దిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ఆటగాడిగా పంత్ కు రావాల్సిన రూ.16 కోట్లు జట్టుకు అందించాలని ఫ్రాంచైజీని బీసీసీఐ ఆదేశించింది. వచ్చే ఆసియా కప్ వరకు పంత్ అందుబాటులోకి వస్తాడని అనుకుంటున్నా అంతకుమించి సమయం పట్టొచ్చని అంటున్నారు.
ఇక బీసీసీఐ తాజా నిర్ణయంతో.. ఐదు కోట్ల రూపాయలతో పాటుగా దిల్లీ క్యాపిటల్స్ రూ.16 కోట్లు అతడి ఖాతాలో జమ చేస్తాయి. ఈ మేరకు బీసీసీఐ ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా ఉంది. బీసీసీఐ(BCCI) నిబంధనల ప్రకారం బోర్డు కాంట్రాక్టులో ఉన్న ఆటగాళ్లందరికీ బీమా ఉంటుంది. ఎవరైనా.. గాయాలపాలైతే.. బోర్డు నుంచి రావాల్సిన మొత్తం అందుకుంటారు.