India vs Bangladesh 2nd Test: రెండో టెస్టులో బంగ్లా ఆలౌట్.. రాణించిన ఉమేష్, అశ్విన్-bangladesh 227 all out in 2nd test 1st innings against india ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Bangladesh 227 All Out In 2nd Test 1st Innings Against India

India vs Bangladesh 2nd Test: రెండో టెస్టులో బంగ్లా ఆలౌట్.. రాణించిన ఉమేష్, అశ్విన్

Maragani Govardhan HT Telugu
Dec 22, 2022 03:49 PM IST

India vs Bangladesh 2nd Test: బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు రాణించారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును 227 పరుగులకు ఆలౌట్ చేశారు. బంగ్లా బ్యాటర్ మొమినుల్ అర్ధ సెంచరీ మినహా మిగిలన వారు విఫలమయ్యారు.

భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్టు
భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్టు (ANI)

India vs Bangladesh 2nd Test: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ తక్కువ పరుగులకే కుప్పకూలింది. ఢాకా ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లా 73.5 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్ల ధాటికి తక్కువ పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బ్యాటర్లలో మొమినుల్ హఖ్(84) అర్ధశతకం మినహా.. మిగిలిన వారంతా విఫలమవడంతో ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. టీమిండియా బౌలర్లు ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ చెరో నాలుగు వికెట్లతో విజృంభించగా.. చాలా కాలం గ్యాప్ తర్వాత టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చిన ఉనాద్కట్ 2 వికెట్లతో రాణించాడు.

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు భారత్ బౌలర్లు ఆరంభంలోనే అడ్డుకట్ట వేశారు. జట్టు 39 పరుగులప్పుడే ఓపెనర్ జకీర్ హుస్సేన్(15)ను ఉనాద్కట్ ఔట్ చేయడంతో తొలి వికెట్ పడింది. తర్వాతి ఓవర్లోనే అశ్విన్ నజ్ముల్‌ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. అనంతరం కాసేపటికే కెప్టెన్ షకిబుల్ హసన్‌ను(16) ఉమేశ్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు. ఫలితంగా 82 పరుగులకే బంగ్లా 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది.

ఇలాంటి సమయంలో వన్డౌన్ బ్యాటర్ మొమినుల్ హఖ్ రాణించాడు. నిలకడగా ఆడుతూ.. స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ క్రీజులో పాతుకుపోయాడు. ఓ పక్క అతడు నిలకడగా ఆడుతుంటే.. మరోపక్క బంగ్లా బ్యాటర్లు ఒక్కొక్కరిగా పెవిలియన్ బాట పట్టారు. కాసేపు ముష్ఫీకర్ రహీమ్(26), లిటన్ దాస్(25) వేగంగా బ్యాటింగ్ చేసినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయారు. అశ్విన్, ఉమేశ్ ధాటికి ఔటయ్యారు.

వికెట్లు పడుతున్నా.. మొమినుల్ మాత్రం పట్టు విడలేదు. ఓపికగా క్రీజులోని ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచాడు. ఈ క్రమంలోనే అతడు అర్ధశతకం పూర్తి చేశాడు. అయితే సెంచరీకి సమీపిస్తున్న సమయంలో అతడిని అశ్విన్ ఔట్ చేయడంతో బంగ్లా పతనం మొదలైంది. గత మ్యాచ్ వరకు తోక తెంచడంలో ఇబ్బంది పడిన టీమిండియా బౌలర్లు.. ఈ మ్యాచ్‌లో మాత్రు ఆ తప్పును పునరావృతం చేయలేదు. 14 పరుగుల వ్యవధిలోనే ఐదు వికెట్లు తీసి బంగ్లాను ఇబ్బందుల్లోకి నెట్టారు. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లా జట్టు 73.5 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది. అనంతరం టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది.

WhatsApp channel

సంబంధిత కథనం