Asia Cup: యూఏఈలో ఆసియా కప్: సౌరవ్ గంగూలీ
Asia Cup: ఆసియాకప్ ఎక్కడ జరుగుతుందన్నదానిపై సస్పెన్స్ వీడింది. శ్రీలంకలో నిర్వహించడం తమ వల్ల కాదని అక్కడి బోర్డు చెప్పడంతో ఈసారి టోర్నీ యూఏఈలో జరగనుంది.

న్యూఢిల్లీ: ఆసియాకప్ ఈ ఏడాది శ్రీలంకలో జరగాల్సి ఉంది. ఆగస్ట్ 27 నుంచి సెప్టెంబర్ 11 వరకూ జరగాల్సిన ఈ ఆరు దేశాల టోర్నీని నిర్వహించడం తమ వల్ల కాదంటూ ఈ మధ్యే లంక బోర్డు చేతులెత్తేసింది. ఆతిథ్య హక్కుల తమ దగ్గరే ఉండటంతో యూఏఈలోగానీ, ఇతర ఏదైనా దేశంలో నిర్వహించడానికి తాము సిద్ధమని కూడా ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఈ టోర్నీ ఇండియాకు వస్తుందా అని కూడా చాలా మంది భావించారు. అయితే ఈసారి టోర్నీ యూఏఈలోనే జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురువారం స్పష్టం చేశారు. ప్రస్తుతం వర్షం కురవని ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది యూఏఈ అని, అందుకే ఆసియాకప్ అక్కడే జరుగుతుందని గంగూలీ స్పష్టం చేశారు.
గురువారం రాత్రి బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో ప్రస్తుతం ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు జరుగుతున్నా.. ఆరు దేశాలు పాల్గొనే ఇంత పెద్ద టోర్నీ నిర్వహించడం సాధ్యం కాదని అంతకుముందు లంక బోర్డు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్‌కు చెప్పింది.
అదే సమయంలో యూఏఈలో నిర్వహించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. నిజానికి ఈ రేసులో ఇండియా కూడా ఉన్నా.. ప్రస్తుతం దేశంలో వర్షా కాలం కావడంతో టోర్నీకి ఆటంకం కలగడం ఖాయం. దీంతో ఇక్కడ టోర్నీ నిర్వహించే ప్రతిపాదనను బీసీసీఐ విరమించుకుంది. యూఏఈకి ఇలాంటి అనుకోని అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
గతంలో పాకిస్థాన్ తమ దేశంలో పరిస్థితులు బాగా లేక అక్కడ టోర్నీలు నిర్వహించేది. ఆ తర్వాత ఇండియాలో కరోనా కారణంగా రెండు సీజన్ల ఐపీఎల్ కూడా అక్కడే జరిగింది. ఇప్పుడు శ్రీలంకలో పరిస్థితులు అనుకూలించక మరోసారి ఆసియాకప్‌లాంటి పెద్ద టోర్నీని కూడా యూఏఈ నిర్వహిస్తోంది.
సంబంధిత కథనం