Ajinkya Rahane | సిరాజ్‌కు అలా జరగడంతో సిడ్నీ టెస్టు ఆడకూడదనుకున్నాం: రహానే-ajinkya rahane recalls mohammad siraj racially abused incident in sydney ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ajinkya Rahane | సిరాజ్‌కు అలా జరగడంతో సిడ్నీ టెస్టు ఆడకూడదనుకున్నాం: రహానే

Ajinkya Rahane | సిరాజ్‌కు అలా జరగడంతో సిడ్నీ టెస్టు ఆడకూడదనుకున్నాం: రహానే

2020-21 సీజన్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో కొంతమంది భారత ఆటగాడు సిరాజ్‌పై జాతి వివక్ష చూపిన విషయం తెలిసిందే. సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో సిరాజ్‌ను కొంతమంది అసభ్యకర పదజాలంతో దూషించడంతో తాము ఆటను మధ్యలోనే నిలిపేయాలనుకున్నట్లు అప్పటి కెప్టెన్ రహానే తెలిపాడు.

అజింక్య రహానే (PTI)

ఏడాదిన్నర క్రితం ఆస్ట్రేలియాలో భారత జట్టు పర్యటించిన విషయం తెలిసిందే. 2020-21 సీజన్‌లో నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా అద్భుతమైన ఆటతీరుతో 2-1 తేడాతో సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ పర్యటన భారత్‌కు ఎంత ఆనందాన్నించిందో అంతే చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ సిరీస్ మధ్యలోనే ఇండియాకు రావడంతో రహానే సారథ్య బాధ్యతలను తీసుకున్నాడు. అయితే సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో భారత ఆటగాడు మొహమ్మద్ సిరాజ్ పట్ల కొంత మంది ఆస్ట్రేలియా వాసులు జాత్యహంకారాన్ని(Racism) ప్రదర్శించారు.

సిడ్నీ టెస్టులో మూడో రోజు మ్యాచ్ జరుగుతున్నప్పుడు సిరాజ్‌పై జాతి వివక్ష చూపిస్తూ.. కొంతమంది అసభ్యకర పదజాలంతో దూషించారు. ఈ విషయాన్ని టీమిండియా మేనేజ్మెంట్ నిర్వాహకులకు చేరవేసింది. కానీ తర్వాతి రోజు ఉదయం కూడా ఇలాగే జరగడంతో అంపైర్లకు ఫిర్యాదు చేశారు. సిరాజ్ ఈ విషయాన్ని తనతో చెప్పడంతో మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించుకున్నట్లు రహానే ఆనాటి చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ సిరీస్‌కు సంబంధించి ముంబయిలో జరిగిన ఓ వేడుకలో పాల్గొన్న అతడు ఆ సంఘటన గురించి తెలియజేశారు.

"నాలుగో రోజు సిరాజ్ నా వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని చెప్పాడు. ఈ విషయంపై అంపైర్లకు(పాల్ రిఫెల్, పాల్ విల్సన్) ఫిర్యాదు చేశాను. బాధ్యులపై తప్పకుండా చర్య తీసుకుంటే తప్ప మేము ఆడబోమని చెప్పాను. కానీ అంపైర్లు గేమ్ మాత్రం ఆపలేం. కావాలనుకుంటే మీ అంతటా మీరే గేమ్ నుంచి వెళ్లిపోవచ్చని మాతో చెప్పారు. ఇక్కడకు మేము ఆడేందుకు వచ్చామని, డ్రెస్సింగ్ రూంలో కూర్చుని వేడుక చూసేందుకు కాదని బదులిచ్చాను. ఈ విషయంలో పరిస్థితులు అర్థం చేసుకున్న నా సహచరులు నాకు మద్దతు ఇచ్చారు. సిడ్నీలో ఏదైతో జరిగిందో అది పూర్తిగా తప్పు." అని రహానే తెలిపాడు.

<p>అంపైర్లకు ఫిర్యాదు చేస్తున్న సిరాజ్, రహానే</p>
అంపైర్లకు ఫిర్యాదు చేస్తున్న సిరాజ్, రహానే (Hindustan Times)

అనంతరం ఈ అంశంపై క్రికెట్ ఆస్ట్రేలియా కూడా స్పందించింది. టీమిండియా ఆటగాళ్లపై జాతి వివక్ష చూపినట్లు ఆధారాలున్నాయని ఖరారు చేసింది. అనంతరం భారత ప్లేయర్లకు క్షమాపణలు చెప్పింది.

ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. తొలి టెస్టులో ఓటమి పాలైన భారత్.. అద్భుతంగా పుంజుకుని సిరీస్ కైవసం చేసుకోవడం విశేషం. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తనకు అప్పుడే పుట్టిన బేబీని చూసేందుకు ఇండియాకు రావడంతో.. రెండో టెస్టు నుంచి సారథ్య బాధ్యతలను రహానే తీసుకున్నాడు.

సంబంధిత కథనం

టాపిక్