Korrala laddu: కొర్రల లడ్డు ఇలా చేసి దాచుకోండి, రోజుకి ఒక్కటి తిన్నా చాలు ఎంతో ఆరోగ్యం-korrala laddu recipe in telugu know how to make this sweet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Korrala Laddu: కొర్రల లడ్డు ఇలా చేసి దాచుకోండి, రోజుకి ఒక్కటి తిన్నా చాలు ఎంతో ఆరోగ్యం

Korrala laddu: కొర్రల లడ్డు ఇలా చేసి దాచుకోండి, రోజుకి ఒక్కటి తిన్నా చాలు ఎంతో ఆరోగ్యం

Haritha Chappa HT Telugu
May 01, 2024 03:30 PM IST

Korrala laddu: కొర్రలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో లడ్డూలు తయారు చేసి దాచుకుంటే రోజుకొకటి తినవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

కొర్రల లడ్డూ రెసిపీ
కొర్రల లడ్డూ రెసిపీ (Youtube)

Korrala laddu: చిరుధాన్యాల్లో కొర్రలు ఒకటి. నిజానికి వీటితో వంటకాలు చేసుకునే వారి సంఖ్య తగ్గిపోయింది. కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ప్రతిరోజూ వండుకోవడం కష్టం అనుకుంటే వీటితో లడ్డూలు తయారుచేసి స్టోర్ చేసుకోండి. ప్రతిరోజూ ఒక లడ్డు తినడం వల్ల ఆ కొర్రల్లోని పోషకాలను పొందవచ్చు. ముఖ్యంగా పిల్లలకు ప్రతిరోజూ సాయంత్రం సమయంలో స్నాక్‌గా ఈ లడ్డూను తినిపించండి. వారికి శక్తి అందడంతో పాటు ఎన్నో పోషకాలు అందుతాయి. ఈ కొర్రలు లడ్డుల్లో బెల్లాన్ని వినియోగిస్తాం, కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఐరన్ పుష్కలంగా శరీరానికి అందుతుంది.

కొర్రల లడ్డు రెసిపీకి కావాల్సిన పదార్థాలు

కొర్రలు - ఒక కప్పు

అవిసె గింజలు - ఒక కప్పు

నువ్వులు - ఒక కప్పు

బాదం - గుప్పెడు

జీడిపప్పు - గుప్పెడు

నెయ్యి - రెండు స్పూన్లు

యాలకుల పొడి - అర స్పూను

బెల్లం తురుము - ఒకటిన్నర కప్పు

కొర్రల లడ్డు రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి కొర్రలను వేయించి పక్కన పెట్టుకోవాలి.

2. అలాగే అవిసె గింజలు, నువ్వులను కూడా వేరువేరుగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు అదే కళాయిలో నెయ్యి వేసి... ఆ నెయ్యిలో జీడిపప్పు తరుగు, బాదం తరుగు వేసి వేయించుకొని పక్కన పెట్టాలి.

4. ఇప్పుడు మిక్సీలో కొర్రలు, అవిసె గింజలు వేసి పొడిలా చేసుకోవాలి.

5. అలాగే బెల్లాన్ని వేసి కలిపి మిక్సీ పట్టుకోవాలి.

6. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేయాలి.

7. ఆ గిన్నెలో యాలకుల పొడి, నెయ్యి, ముందుగా వేయించి పెట్టుకున్న బాదం, జీడిపప్పు తరుగును కూడా వేసి బాగా కలుపుకోవాలి.

8. అలాగే వేయించి పెట్టుకున్న నువ్వులను వేసి బాగా కలపాలి.

9. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని లడ్డూల్లా చుట్టుకోవాలి. వీటిని గాలి చొరబడని కంటైనర్లలో వేసి దాచుకోవాలి.

10. ప్రతిరోజూ ఒక కొర్రల లడ్డు ఇంట్లో ఉన్న పెద్దలు, పిల్లలు తినాలి.

11. ఇది ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది.

బెల్లం, అవిసె గింజలు, నువ్వులు, కొర్రలు, బాదం, జీడిపప్పు, నెయ్యి ... ఇవన్నీ కూడా మన శరీరానికి అత్యవసరమైనవే. ఇవి మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా కొర్రలు బరువును తగ్గిస్తాయి. అలాగే డయాబెటిస్ రాకుండా అడ్డుకుంటాయి. డయాబెటిస్ ఉన్నవారు ఇందులో బెల్లం ఉంది. కాబట్టి తినకూడదని అనుకోకండి. ప్రతి రెండు రోజులకు ఒకసారి ఒక కొర్రల లడ్డు తినేందుకు ప్రయత్నించండి. ఇది చాలా మేలు చేస్తుంది.

WhatsApp channel

టాపిక్