Calcium: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే ప్రతిరోజూ క్యాల్షియం సప్లిమెంట్లు తీసుకోవాలని అర్థం-if you experience these symptoms you may need to take calcium supplements daily ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Calcium: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే ప్రతిరోజూ క్యాల్షియం సప్లిమెంట్లు తీసుకోవాలని అర్థం

Calcium: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే ప్రతిరోజూ క్యాల్షియం సప్లిమెంట్లు తీసుకోవాలని అర్థం

Haritha Chappa HT Telugu
May 02, 2024 02:20 PM IST

Calcium: కాల్షియం శరీరంలో లోపిస్తే కొన్ని రకాల లక్షణాల ద్వారా ఆ విషయాన్ని చెబుతుంది. కాబట్టి ఆ లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించి కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది.

కాల్షియం సప్లిమెంట్లు
కాల్షియం సప్లిమెంట్లు (Pixabay)

Calcium: మన శరీరంలో క్యాల్షియం ముఖ్యమైన పోషకం. ఎముకలు బలంగా ఉండాలన్నా, దంతాలు దృఢంగా ఉండాలన్నా, గుండెతో సహా కండరాల సంకోచాలను నియంత్రించాలన్నా, నరాల వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలన్నా... అన్నింటికీ క్యాల్షియం అవసరం పడుతుంది. హార్మోన్ల ఉత్పత్తిలో, కణాల సిగ్నలింగ్ వ్యవస్థలో, ఎంజైముల పనితీరులో క్యాల్షియం పాత్ర ముఖ్యమైనది. అయితే శరీరంలో ఎప్పుడైతే కాల్షియం తగ్గుతుందో.. అది కొన్ని సంకేతాల ద్వారా మనకు ఆ విషయాన్ని తెలియజేస్తుంది. అప్పుడు వైద్యులను సంప్రదించి ప్రతిరోజూ క్యాల్షియం సప్లిమెంట్లు తీసుకోవడం చాలా అవసరం.

కాల్షియం ఎందుకు?

కండరాల పనితీరుకు కాల్షియం కీలకమైనది. క్యాల్షియం స్థాయిలు తక్కువగా ఉంటే కండరాలు సరిగా పనిచేయలేవు. కండరాల్లో తిమ్మిరి పట్టడం అధికమవుతుంది. నీరసంగా అనిపిస్తుంది. అలాగే ఏదైనా పని చేస్తున్నప్పుడే కాదు, విశ్రాంతి తీసుకున్నప్పుడు కూడా కాళ్లు, పాదాలు, చేతుల్లోని కండరాలలో తిమ్మిరిగా అనిపించవచ్చు.

కాలుష్యం తగ్గడం వల్ల నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. శరీరం జలదరించినట్టు అనిపిస్తుంది. వేళ్లు, కాళ్లు, పెదవులు, నాలుక వంటి భాగాల చివర సూదులతో పొడిచినట్టు అనిపిస్తుంది. క్యాల్షియం స్థాయిలు తగ్గితే నరాల పనితీరులో అంతరాయం కలుగుతుంది.

కాల్షియం స్థాయిలు తగ్గితే కండరాలు బలహీనంగా మారుతాయి. దీనివల్ల తీవ్ర అలసటగా అనిపిస్తుంది. ఏ పనీ చేయాలనిపించదు. చేతులు, కాళ్లల్లో ఉన్న కండరాలు సహకరించవు. బద్దకంగా అనిపిస్తుంది.

వేలి గోళ్లు కూడా మన ఆరోగ్యాన్ని సూచిస్తాయి. క్యాల్షియం స్థాయిలను గోళ్ల ద్వారా తెలుసుకోవచ్చు. శరీరంలో తగినంత కాల్షియం లేకపోతే గోళ్లు పెళుసుగా మారిపోతాయి. గోళ్ల చివర్లు విరిగిపోతూ, చీలిపోతూ ఉంటాయి. అవి ఆరోగ్యంగా, అందంగా కనిపించవు.

క్యాల్షియం అనేది దంతాల ఎనామెల్‌లో ముఖ్యమైన భాగం. ఇది దంతాల పై పొరను రక్షిస్తూ ఉంటుంది. కాల్షియం తగినంత అందకపోతే ఎనామిల్ బలహీనపడుతుంది. దంత క్షయం వంటి సమస్యలు వస్తాయి. త్వరగా దంతాలు ఊడిపోతాయి. అలాగే చిగుళ్ల వ్యాధి కూడా రావచ్చు.

బలమైన ఆరోగ్యకరమైన ఎముకలు కోసం క్యాల్షియం చాలా కీలకం. దీర్ఘకాలికంగా కాల్షియం లోపిస్తే ఎముక బలహీనంగా మారుతుంది. దీనివల్ల ఆర్థరైటిస్ వంటి వ్యాధులు రావచ్చు.

గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రించే విద్యుత్ ప్రేరణలను నియంత్రించే శక్తి క్యాల్షియంకి ఉంది. క్యాల్షియం స్థాయి తక్కువగా ఉన్నప్పుడు గుండె లయలో అంతరాయాలు ఏర్పడతాయి. దీనిని కార్డియాక్ అరిథ్మియా అని పిలుస్తారు. దీనివల్ల గుండె దడ రావడం, హృదయ స్పందనలు క్రమ రహితంగా ఉండడం, ఛాతీలో కాస్త నొప్పి రావడం వంటివి జరుగుతాయి.

కాల్షియం కోసం ఏం తినాలి?

కాల్షియం కోసం ప్రత్యేకంగా కొన్ని రకాల ఆహారాలను ప్రతిరోజూ తినాలి. ముఖ్యంగా పాలు, పెరుగు, చీజ్ వంటివి తింటూ ఉండాలి. అలాగే పాలకూర, కాలే వంటి ఆకుకూరలను తింటూ ఉండాలి. బాదం పప్పులు, సోయా పాలు, సోయా ఉత్పత్తులు, టోపు, పనీర్ వంటివి తినాలి. అలాగే సాల్మన్, సార్డినెస్ వంటి చేపలు కూడా తింటూ ఉండాలి. చియా గింజలు, నువ్వులు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవన్నీ కూడా కాల్షియన్ని శరీరానికి అందిస్తాయి.

WhatsApp channel

టాపిక్