SRH vs RR IPL 2024: రాజస్థాన్ రాయల్స్‌కు గట్టి షాక్.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ సంచలన విజయం-srh vs rr ipl 2024 sunrisers hyderbad beat rajasthan royals by one run moved to 4th place again in points table ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Srh Vs Rr Ipl 2024: రాజస్థాన్ రాయల్స్‌కు గట్టి షాక్.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ సంచలన విజయం

SRH vs RR IPL 2024: రాజస్థాన్ రాయల్స్‌కు గట్టి షాక్.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ సంచలన విజయం

Hari Prasad S HT Telugu
May 02, 2024 11:35 PM IST

SRH vs RR IPL 2024: రాజస్థాన్ రాయల్స్ కు గట్టి షాక్ ఇచ్చింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఒక్క పరుగు తేడాతో పాయింట్ల టేబుల్లో టాప్ లో ఉన్న జట్టును ఓడించి సంచలనం సృష్టించింది.

రాజస్థాన్ రాయల్స్‌కు గట్టి షాక్.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ సంచలన విజయం
రాజస్థాన్ రాయల్స్‌కు గట్టి షాక్.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ సంచలన విజయం (ANI )

SRH vs RR IPL 2024: సన్ రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయం సాధించింది. వరుసగా రెండు ఓటముల తర్వాత సొంత మైదానంలో జరిగిన మ్యాచ్ లో నంబర్ వన్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ ను కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడించడం విశేషం. 202 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన రాయల్స్ టీమ్.. 20 ఓవర్లలో 7 వికెట్లకు 200 రన్స్ చేసింది.

నరాలు తెగే ఉత్కంఠ

రాజస్థాన్ రాయల్స్ గెలవడానికి చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం అయ్యాయి. ఈ దశలో తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీసి రాజస్థాన్ ను దెబ్బతీసిన భువనేశ్వర్ బంతిని అందుకున్నాడు. అతడు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చివరి బంతి వరకూ మ్యాచ్ ను తీసుకొచ్చాడు. సన్ రైజర్స్ ఫీల్డింగ్ లోపాల వల్ల రాయల్స్ చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచింది.

అయితే చివరి బంతికి పావెల్ (27) ను ఔట్ చేసి ఒక్క పరుగు తేడాతో సన్ రైజర్స్ ను గెలిపించాడు భువనేశ్వర్ కుమార్. అతడు 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. నిజానికి చేజింగ్ లో తొలి ఓవర్లోనే రాజస్థాన్ రాయల్స్ రెండు వికెట్లు కోల్పోయింది. జోస్ బట్లర్ (0), సంజూ శాంసన్ (0) డకౌట్లయ్యారు. అయితే ఈ దశలో యశస్వి జైస్వాల్ (67), రియాన్ పరాగ్ (77) చెలరేగడంతో రాయల్స్ గెలుపు ఖాయం అనిపించింది.

అయితే కీలక దశలో ఈ ఇద్దరినీ ఔట్ చేసి సన్ రైజర్స్ మళ్లీ గాడిలో పడింది. చివర్లో హెట్‌మయర్ (13), పావెల్ పోరాడారు. అయినా సన్ రైజర్స్ చివరి బంతి వరకూ పోరాడి ఒక పరుగు తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. ఈ విజయంతో సన్ రైజర్స్ మళ్లీ నాలుగో స్థానానికి చేరింది. చెన్నై సూపర్ కింగ్స్ ఐదో స్థానానికి పడిపోయింది.

నితీష్, హెడ్, క్లాసెన్ మెరుపులు

సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండు ఓటముల తర్వాత మరోసారి బ్యాట్ తో చెలరేగింది. పాయింట్ల టేబుల్లో టాప్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ తో సొంత మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 201 రన్స్ చేసింది. నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్ మెరుపు హాఫ్ సెంచరీలతో టీమ్ కు భారీ స్కోరు అందించారు.

గత రెండు మ్యాచ్ లలో చేజింగ్ లో బోల్తా పడి ఓడిపోయిన సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో టాస్ గెలవగానే మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ గత మ్యాచ్ లలోలాగా చెలరేగలేదు. 4.1 ఓవర్ల దగ్గర అభిషేక్ (12) ఔటయ్యాడు. అప్పటికి సన్ రైజర్స్ స్కోరు 25 మాత్రమే. ఆ తర్వాత అన్మోల్‌ప్రీత్ సింగ్ (5) మరోసారి విఫలమవడంతో 35 పరుగులకే రెండు వికెట్లు పడ్డాయి.

ఈ దశలో క్రీజులో ఉన్న హెడ్ కు నితీష్ కుమార్ రెడ్డి తోడయ్యాడు. ఇద్దరూ కలిసి రాయల్స్ బౌలర్లను ఆటాడుకున్నారు. మూడో వికెట్ కు 96 పరుగులు జోడించి ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టారు. హెడ్ 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్ లతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న హెడ్.. ఈ మ్యాచ్ లో ఆ స్థాయిలో ఇరగదీయకపోయినా.. ఫర్వాలేదనిపించాడు.

అయితే మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి మాత్రం మరోసారి మెరుపులు మెరిపించాడు. అతడు సిక్సర్ల మోత మోగించాడు. 42 బంతుల్లోనే 8 సిక్స్ లు, 2 ఫోర్లతో 76 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అటు క్లాసెన్ కూడా చెలరేగాడు. అతడు 19 బంతుల్లోనే 3 సిక్స్ లు, 3 ఫోర్లతో 42 రన్స్ చేశాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్ కు అజేయంగా 66 పరుగులు జోడించారు.

రాయల్స్ బౌలర్లలో చహల్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అతడు 4 ఓవర్లలో ఏకంగా 62 రన్స్ ఇచ్చాడు. అవేష్ ఖాన్ మాత్రం 4 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. సందీప్ శర్మ కూడా 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిన సన్ రైజర్స్ కు ఇది చాలా కీలకమైన మ్యాచ్. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్త్ ను ఖాయం చేసుకుంటుంది.

 

IPL_Entry_Point