Sangareddy fake Documents: నకిలీ పత్రాలను సృష్టించి ఫ్లాట్లను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు-a gang that creates fake documents and sells flats busted ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy Fake Documents: నకిలీ పత్రాలను సృష్టించి ఫ్లాట్లను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు

Sangareddy fake Documents: నకిలీ పత్రాలను సృష్టించి ఫ్లాట్లను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు

Sarath chandra.B HT Telugu
May 02, 2024 02:07 PM IST

Sangareddy fake Documents: తెలంగాణలో భూముల విలువలు పెరగడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అడ్డదారిలో సులభంగా డబ్బులు సంపాదించాలని నకిలీ పత్రాలను సృష్టిస్తూ అమాయక ప్రజల స్థలాలను కాజేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

నకిలీ డాక్యుమెంట్లతో ఫ్లాట్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
నకిలీ డాక్యుమెంట్లతో ఫ్లాట్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

Sangareddy fake Documents: సంగారెడ్డి జిల్లాలో నకిలీ వంశస్థులను,నకిలీ పత్రాలను సృష్టించి కోట్ల విలువ చేసే ఫ్లాట్లను విక్రయిస్తున్న ముఠా గుట్టును సి.సి.యస్ పోలీసులు రట్టు చేశారు. ఇప్పటి వరకు 15 నుంచి 20 ప్లాట్లను అమ్మారని వాటి విలువ సుమారు 15 కోట్ల వరకు ఉంటుందన్నారు. నకిలీ ప్లాట్ లను కాజేసిన ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామన్నారు.

ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి …

దీనిపై బుధవారం సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ విలేకర్ల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కు చెందిన దుర్గా ప్రసాద్, సుబ్బరావు, రవిగౌడ్, అనే ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి జిల్లాలో అమీన్పూర్, రామేశ్వరం బండ ప్రాంతంలో గత 20-25 సంవత్సరాలుగా ఖాళీగా వున్న ప్లాట్ లను గుర్తించారు.

ఆ స్థలాల అసలు యజమాని ఎవరని తెలుసుకుని రెండు మార్గాలలో స్థలాలను అమ్ముతున్నారని తెలిపారు. ఇందులో భాగంగా నకిలీ యజమానిని సృష్టించి అసలు యజమాని పేరు మీదుగా నకిలీ ఆధార్ కార్డు, నకిలీ సెల్ డీడ్, లింక్ డాక్యుమెంట్లను తయారు చేసి ప్లాట్లను విక్రయిస్తున్నారన్నారు. అదేవిధంగా నకిలీ వంశస్తులను సృష్టించి ప్లాట్లను అమ్ముతున్నారు.

అమాయక ప్రజలను ఒప్పించి ..

నకిలీ డాక్యుమెంట్ల కోసం బండి దుర్గాప్రసాద్, రవిగౌడ్ లు చాలా కాలంగా ఖాళీగా ఉన్నా ప్లాట్లను గుర్తించి, ఆ ప్లాట్ యజమానికి సరిపడిన వయస్సు గల వ్యక్తి లేదా మహిళ కావాలని సుబ్బారావుతో చెప్పగా అతడు అమాయక ప్రజలను ఎంచుకొని, వారికి రెండు, మూడు వేలు ఇస్తామని చెప్పి ఒప్పించేవారు.

వారిని రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వచ్చి సంతకాలు చేయించుకొని అసలు యజమాని పేరు మీద నకిలీ ఆధార్ కార్డ్ ను తయారు చేసి ప్లాట్లను అతని నుండి వేరే వ్యక్తికి, అతని నుండి మరో వ్యక్తికి ఇలా ఇద్దరు ముగ్గురు పేర్ల మీదికి మార్చి, వేరే వ్యక్తులకు అమ్మి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించేవారని వివరించారు.

నకిలీ వంశస్తులను సృష్టించి విక్రయాలు …

నకిలీ వంశస్తులను సృష్టించి అసలు యజమాని మరణించినట్లుగా మరణ ధ్రువీకరణ పత్రం మరియు యజమాని యొక్క కూతురి క్రింద వేరే మహిళల పేరు మీద ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ (FMC) సృష్టించేవారు.

అతని కూతురు ఉన్నట్లుగా వేరే మహిళలను సృష్టించి ప్లాట్లను అమ్మి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించేవారు. ఈ ముఠా నకిలీ ఆధార్, నకిలీ పత్రాలు, నకిలీ వంశస్తులను సృష్టించి, ఇప్పటి వరకు 15 నుంచి 20 ప్లాట్లను అమ్మారని, ఈ ప్లాట్ల విలువ సుమారు 15 కోట్ల వరకు ఉంటుందన్నారు.

బాధితులు ఫిర్యాదు చేయడంతో గత నెల 20న దుర్గాప్రసాద్‌‌, సుబ్బారావు, రవిగౌడ్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేశారు. పూర్తి స్థాయి విచారణ తర్వాత కేసు నమోదు చేసి అరెస్ట్‌‌ చేసినట్లు ఎస్పీ తెలిపారు.

రిజిస్టర్ కార్యాలయం నిర్లక్ష్యం...

ఈ విధంగా నకిలీ ఆధార్, నకిలీ పత్రాలు, నకిలీ వంశస్తులను సృష్టించి అమాయక ప్రజల ప్లాట్‌లను కాజేయడంలో రిజిస్టర్ కార్యాలయం వారి నిర్లక్ష్యం కొట్టొచ్చినటట్లుగా కనిపిస్తుందని, వారిపై కూడా చట్టరిత్య తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ అన్నారు. జిల్లా ప్రజలు ఇట్టి విషయంలో జాగ్రత్త వహించాలని, నకిలీ పత్రాల కేటుగాల వలలో పడకూడదని, ప్లాట్ ల కొనుగోలు విషయంలో ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోవాలని ఎస్పీ సూచించారు.

(రిపోర్టింగ్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి)

IPL_Entry_Point