Rachakonda Trip: హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న రాచకొండ కోటను కచ్చితంగా చూడాల్సిందే, ఒక్కరోజులో వెళ్లి రావచ్చు-rachakonda fort which is close to hyderabad is a must see and can be visited in one day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rachakonda Trip: హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న రాచకొండ కోటను కచ్చితంగా చూడాల్సిందే, ఒక్కరోజులో వెళ్లి రావచ్చు

Rachakonda Trip: హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న రాచకొండ కోటను కచ్చితంగా చూడాల్సిందే, ఒక్కరోజులో వెళ్లి రావచ్చు

Haritha Chappa HT Telugu
May 01, 2024 12:40 PM IST

Rachakonda Trip: వేసవిలో ఉదయం వెళ్లి సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేలా ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటున్నారా? అయితే హైదరాబాదులో ఉన్నవారు రాచకొండ కోటకు ట్రిప్ వేసుకోండి.

రాచకొండ కోట
రాచకొండ కోట

Rachakonda Trip: హైదరాబాద్ నుండి చాలా దగ్గరలో ఉన్న చారిత్రాత్మకమైన కోట రాచకొండ ఫోర్ట్. హైదరాబాద్ నుండి బయలుదేరితే కేవలం ఒక్క రోజులోనే వెళ్లి రావచ్చు. హైదరాబాద్ ట్రిప్ ప్లాన్ చేసేవారు కచ్చితంగా రాచకొండ కోటను కూడా చూసి రావాల్సిందే. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు ఈ రాచకొండ కోట ఉత్తమ స్పాట్ అని చెప్పుకోవచ్చు. గోల్కొండ లాగే రాచకొండ చూసేందుకు గంభీరంగా చారిత్రక కట్టడాలతో నిండి ఉంటుంది. ఆనాటి పురాతన కోటలు ఓసారి చరిత్రను గుర్తుకు తెస్తాయి.

రాచకొండ కోట చుట్టూ ఎన్నో ప్రకృతి అందాలు పరవశించేలా ఉంటాయి. చుట్టూ పచ్చని పంట పొలాలు కంటికి ఇంపుగా ఉంటాయి. అలాగే అక్కడ ఉన్న పురాతన దేవాలయాలు, మెట్ల బావి, ప్రాచీన కట్టడాలు మన చరిత్రను గుర్తుకు తెచ్చేలా ఉంటాయి.

రాచకొండ కోటలో చూడాల్సినవి

రాచకొండ కోటకు దగ్గరలో ఉన్న మెట్ల బావిని ప్రభుత్వం పునరుద్ధరించింది. కాబట్టి దాన్ని చూసేందుకు మీరు ఖచ్చితంగా వెళ్లాలి. కాకతీయ సామ్రాజ్యానికి సామంత రాజులుగా రేచంర్ల వంశస్థులు ఉండేవారు. వారు ఈ కోట నుంచి తమ పరిపాలనను సాగించారు. ఈ కోట శత్రు దుర్భేధ్యమని చెప్పుకుంటారు. ఇది ఇప్పుడు మంచి పర్యాటక కేంద్రంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ఈ కోట చుట్టూ ఎన్నో అభివృద్ధి పనులు చేసింది. హైదరాబాదులో గోల్కొండ తో పాటు చూడాల్సిన పురాతన కట్టడాల్లో రాచకొండ ఫోర్ట్ కూడా ఒకటి. ఈ కోట దాదాపు ఆరు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఎటు చూసినా పచ్చని మొక్కలతో, చెట్లతో నిండి ఉంటుంది.

హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి ఈ రాచకొండ కోటకు సులువుగా చేరుకోవచ్చు. ఇది రంగారెడ్డి జిల్లా సరిహద్దుల్లో సంస్థాన్ నారాయణపురం అనే మండలంలో ఉంది. హైదరాబాద్ నుంచి ఎల్బీనగర్ చేరుకొని అక్కడ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లి రాచకొండ కోటకు చేరుకోవచ్చు. లేదా ఎల్బీనగర్ నుంచి చౌటుప్పల్ కు వచ్చి... అక్కడ నుంచి నేరుగా సంస్థాన్ నారాయణపురంలో ఉన్న కోటకు వెళ్లొచ్చు. సొంత కారులు ఉన్నవారికి ఇది మంచి ట్రిప్ అని చెప్పవచ్చు. ఈ రాచకొండ ఫోర్ట్ కు బస్సులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. సులువుగానే వెళ్లి రావచ్చు.

ఈ రాచకొండ కోట ఎంట్రన్స్ చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఆలయాన్ని తప్పకుండా దర్శించుకుని రండి. కోటపైకి వెళ్లాక అక్కడ ఉన్న రాజప్రాసాదాలు కచ్చితంగా చూడండి. అలాగే జలాశయం, సంకెళ్ల బావి ఉంటుంది. ఇవి కచ్చితంగా చూసి రావాల్సిందే. ప్రతి యేటా తెలంగాణ ప్రభుత్వం రాచకొండ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ప్రతి ఏడాది మూడు రోజులపాటు ఈ కోటలోనే ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఒక్కసారి మీరు రాచకొండ కోటకు వెళ్లి వస్తే కొన్ని రోజులపాటు ఆ చారిత్రక కట్టడాలు మీ జ్ఞాపకాల్లో మెదులుతూనే ఉంటాయి.

ఈ రాచకొండ కోటలో సంకెళ్ల బావిని కచ్చితంగా చూడాల్సిందే. కొండపైన రెండు అతి పెద్ద బండల మధ్య ఈ నీళ్లు ఉంటాయి. ఈ నీళ్లు ఎక్కడ నుంచి వస్తున్నాయో, ఎలా ఊరుతున్నాయో కూడా ఎవరికీ తెలీదు. రాచకొండ కోటపైకి ఎక్కి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ పంట పొలాలు అందంగా కనిపిస్తాయి. ప్రాంతంలో అతి పెద్ద శివలింగం బయటపడింది. అప్పటినుంచి ఈ కోటకు వస్తున్న వారి సంఖ్య కూడా పెరిగింది.

WhatsApp channel

టాపిక్