Copper bottle cleaning: రాగి బాటిల్ నల్లబడుతోందా.. ఇలా శుభ్రం చేయండి..-process of cleaning copper bottle in easy way ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Copper Bottle Cleaning: రాగి బాటిల్ నల్లబడుతోందా.. ఇలా శుభ్రం చేయండి..

Copper bottle cleaning: రాగి బాటిల్ నల్లబడుతోందా.. ఇలా శుభ్రం చేయండి..

Koutik Pranaya Sree HT Telugu
May 25, 2023 01:00 PM IST

Copper bottle cleaning: రాగి బాటిల్, రాగి వస్తువుల్ని ఎలా సులభంగా శుభ్రం చేసుకోవచ్చో చూడండి.

రాగి సీసా
రాగి సీసా (freepik)

ఆరోగ్యం కోసమని తెచ్చుకున్న రాగి బాటిల్ నలుపెక్కడం వల్ల చాలా మంది పక్కన పెట్టేస్తారు. లేదా దాన్ని శుభ్రం చేయడం కష్టమని కొంతమంది రాగి బాటిల్, రాగి వస్తువుల జోలికి పోరు. నిజానికి దాన్ని శుభ్రం చేసుకోవడం చాలా తేలిక. అయిదు నిమిషాల్లో జిడ్డు మొత్తం వదిలేలా చేయొచ్చు. వివరంగా బయటా, లోపల ఎలా శుభ్రం చేసుకోవచ్చో తెలుసుకోండి.

కొన్ని సులభమైన విధానాల్లో రాగి సీసా శుభ్రం చేసే విధానం:

Step 1: ముందుగా బాటిల్ బయటి వైపు శుభ్రం చేయాలి. గోరువెచ్చని సబ్బు నీళ్లలో స్పాంజి ముంచి వీలైనంత మురికి తొలగించుకోవాలి.

Step 2: ఇప్పుడు సగం నిమ్మకాయ ముక్క, ఉప్పు తీసుకోవాలి. నిమ్మకాయ ముక్క మీద ఉప్పు చల్లి బాటిల్ బయటి వైపు మెల్లగా రుద్దుకోవాలి. లేదంటే ఒక గిన్నెలో నిమ్మరసం, ఉప్పు తీసుకుని ఆ మిశ్రమాన్ని ఏదైనా వస్త్రం సాయంతో రాసుకోవచ్చు.

Step 3: ఇప్పుడు బాటిల్ లోపల వేడి నీళ్లు, ఉప్పు, 2 నిమ్మకాయ ముక్కలు, వెనిగర్ వేసుకోవాలి.

Step 4: బాటిల్ మూత పెట్టుకుని షేక్ చేసుకోండి. ఒక పదినిమిషాలు వదిలేయండి. దీనివల్ల జిడ్డు వదిలిపోతుంది. రాగి వస్తువుల మీద ఉప్పు ఎక్కువ సేపు ఉంచకూడదు. దానివల్ల రియాక్షన్ జరగొచ్చు. అందుకే ఉప్పు రాసి అలా ఎక్కువ సేపు వదిలేయకూడదు. శుభ్రం చేసేయాలి.

Step 5: లోపలా, బయట శుభ్రం చేసుకోవడం పూర్తయ్యాక నీళ్లతో కడిగేయాలి. మెత్తని వస్త్రంతో మరకలు లేకుండా తుడుచుకోవాలి.

Step 6: బాటిల్ మూతను కూడా ఇదే పద్ధతిలో శుభ్రం చేసుకోండి. మూత ఇంకాస్త ఎక్కువగా నల్ల బడిందనుకుంటే వెనిగర్ నీళ్లు సమపాళ్లలో కలుపుకున్న మిశ్రమంతో మూతను రుద్ది నీళ్లతో కడిగేసుకోవచ్చు.

ఇంకొన్ని మార్గాలు:

చింతపండు:

రాగి వస్తువులు శుభ్రం చేయడానికి చింతపండు విరివిగా వాడతారు. దీనివల్ల రాగి వస్తువులకు ప్రత్యేక మెరుపొస్తుంది. చింతపండు గుజ్జును నీళ్లలో కలిపి బాటిల్ ని మొత్తం రుద్దాలి. రెండు నిమిషాలయ్యాక వెంటనే నీళ్లతో కడిగేయాలి. కొత్త మెరుపు వస్తుంది.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడాలో నీళ్లు కలిపి ఈ మిశ్రమాన్ని బాటిల్ కు రుద్దాలి. వెంటనే నీళ్లతో కడిగి, మెత్తని వస్త్రంతో తుడిచేయాలి.

వెనిగర్:

ఒక చెంచా ఉప్పులో రెండు చెంచాల వెనిగర్ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని దూది ఉండ లేదా కాటన్ వస్త్రంతో బాటిల్ మీద రుద్దాలి. వెంటనే చల్లని నీళ్లతో కడిగేయాలి. తడిలేకుండా పొడి వస్త్రంతో తుడుచుకోవాలి.

WhatsApp channel

టాపిక్