పిల్లలు పుట్టగానే పాలసీసాలు కొనే ధోరణి ఇటీవల కాలంలో పెరిగింది.పాలు రావడం లేదని, సరిపోవడం లేదని సీసా పాలు పట్టించేస్తుంటారు. మొదటి ఆరు నెలలు తల్లి పాలు మాత్రమే శిశువులకు పట్టాలి.
By Bolleddu Sarath Chandra Nov 07, 2024
Hindustan Times Telugu
శిశువుకు 6నెలలు నిండిన తర్వాత మాత్రమే తల్లిపాలతో పాటు ఇతర ఆహారపదార్ధాలను తల్లిపాలతో కలిపి అందించాల్సి ఉంటుంది.
తల్లిపాలు తాగించలేని సందర్భాలలో మాత్రమే ఉగ్గు గిన్నె, స్పూన్ సాయంతో పిల్లలకు తాగించాలి. తల్లిపాలు అందుబాటులో లేని పిల్లలకు ఉగ్గుగిన్నెతో తాగించడమే సురక్షితమైన విధానం. సీసా పాలు ఏమాత్రం సురక్షితం కాదు.
ప్రసవం తర్వాత మొదటి కొద్ది రోజులు పాలు రాకపోతే సీసాలతో పాలు తాగిస్తుంటారు. ఇది ప్రమాదకరమని వైద్యులు చెబుతారు. సీసా పాలకు తల్లి పాలకు చాలా తేడా ఉంటుంది. సీసా పాలు అలవాటైతే తల్లి చనుమొనకు గాయం కావొచ్చు.
సీసా పాలకు అలవాటు పడిన పిల్లలకు తల్లి పాలపై ఆసక్తి తగ్గుతుంది. క్రమంగా తల్లి పాలు తాగడం తగ్గిస్తారు. దీని వల్ల పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనిని నిపుల్ కన్ఫ్యూజన్ అంటారు.
సీసా పాలు తాగించడానికి ముందు ప్రతిసారి స్టెరిలైజ్ చేయకపోతే దానిని అంటుకుని ఉన్న బాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి బిడ్డకు అతిసార వ్యాధి రావొచ్చు. స్టెరిలైజ్ చేసినా ఒక్కొోసారి శరీరంపై ఉండే బాక్టీరియా పీకకు అంటుకోవచ్చు.
సీసా పాలు తాగిన పిల్లలు క్రమంగా స్థూలకాయులవుతున్నారు. సీసా పాలు తాగే పిల్లలకు ఎన్ని పాలు సరిపోతాయో అవగాహన లేకపోతే అవసరానికి మించి తాగించడంతో ఈ సమస్య వస్తుంది. స్థూలకాయం ఉన్న పిల్లలకు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.
సీసాపాలు తాగే పిల్లల్లో ఆస్పిరేషన్ న్యూమోనియా శ్వాసకోశ వ్యాధి తరచూ వస్తుంది. పాలు సీసా నుంచి వేగంగా ప్రవహిస్తే పిల్లలు ఉక్కిరిబిక్కిరై శ్వాసనాళాల నుంచి ఊపిరితిత్తులకు ప్రవేశించి న్యూమోనియా వస్తుంది. ఒక్కోసారి ఇది ప్రాణాంతకం అవుతుంది.
ఎక్కువ కాలం సీసా పాలకు అలవాటు పడితే దంతాలు ఎగుడుదిగుడుగా రావొచ్చు.