Bandi sanjay comments against KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టార్గెట్ గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఖమ్మం సభలో కేసీఆర్ ప్రస్తావించిన అంశాలకు కౌంటర్ ఇచ్చారు. మహిళల రిజర్వేరేషన్ల గురించి కేసీఆర్ చెప్పిన మాటలు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కు అర్థమైతే రెండు దెబ్బలేసి పోయేటోడని ఎద్దేవా చేశారు. సభలో పాల్గొన్న నలుగురు సీఎంలు కూడా పలు స్కామ్ లలో ఉన్నవాళ్లే అని ఆరోపించారు. నీటి జలాలపై పదే పదే మాట్లాడుతున్న కేసీఆర్.. గోదావరి, కృష్ణా జలాల విషయంలో ఏం చేశారని ప్రశ్నించారు.కేసీఆర్ నోట ఏ దేశం మాట వచ్చినా ఆ దేశం సర్వనాశనం అవుతుందని.. భారతదేశం బాగుందనే మాట కేసీఆర్ నోట రావొద్దని కోరుకుంటున్నానని చెప్పారు. రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదన్న బండి సంజయ్.. పొలం వద్ద ఫ్రీ కరెంట్ అని, ఇంటి దగ్గర కరెంట్‌కు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. డిస్కంలకు డబ్బులు కట్టకుండా ఫ్రీ కరెంట్ అంటున్నారని.. ముందుగా వాళ్లకు కట్టాల్సిన బకాయిలు చెల్లించాలని సూచించారు. 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. అగ్నిపథ్ గురించి మాట్లాడే కేసీఆర్.. రాష్ట్ర పోలీసు వ్యవస్థపై ఆలోచించాలని హితవు పలికారు.