Rohit Sharma Injury: నెట్స్‌లో గాయపడిన తర్వాత కూడా మళ్లీ ప్రాక్టీస్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అడిలైడ్‌లో గురువారం (నవంబర్ 10) ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ జరగునున్న నేపథ్యంలో టీమిండియా ప్రాక్టీస్ చేస్తోంది.
ఈ క్రమంలో త్రోడౌన్స్ వేయించుకొని బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న రోహిత్ కుడిచేతికి బంతి బలంగా తగిలింది. దీంతో అతడు కాసేపు బాధతో విలవిల్లాడాడు. నెట్స్‌ను బయటకు వెళ్లిపోయి ఐస్‌ప్యాక్‌తో గాయానికి కాసేపు చికిత్స చేయించుకున్నాడు. అయితే అతని గాయం చిన్నదే అని, ఎక్స్‌రే, స్కాన్ అవసరం లేదని ఫిజియో తేల్చాడు.
దీంతో మేనేజ్‌మెంట్‌తోపాటు ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కాసేపటికే రోహిత్ మళ్లీ నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. గ్రూప్ 2లో నాలుగు విజయాలతో టాపర్‌గా నిలిచిన టీమిండియా.. గ్రూప్ 1లో రెండోస్థానంలో నిలిచిన ఇంగ్లండ్‌తో రెండో సెమీఫైనల్లో తలపడనున్న విషయం తెలిసిందే. అంతకుముందు బుధవారం (నవంబర్ 9) పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది.