అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై యోగా గురువు రాందేవ్ బాబా మండిపడ్డారు. ఇతర దేశాలు ఎంతైతే టారిఫ్ విధిస్తారో తామూ అంతే టారిఫ్ విధిస్తామంటూ 'రెసిప్రోకల్ టారిఫ్'లను ట్రంప్ విధిస్తుండంపై రామ్ దేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు సరికొత్త మేథో వలసరాజ్యం శకాన్ని సృష్టిస్తూ పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ట్రంప్ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా టారిఫ్ టెర్రరిజంలో ప్రపంచ రికార్డు సృష్టిస్తారన్న బాబా రామ్ దేవ్.. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఇండియా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విధ్వంసక శక్తులకు గట్టి జవాబిచ్చేందుకు భారతీయులంతా సమష్టిగా నిలబడాలని మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా రామ్‌దేవ్ అన్నారు.