మొహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ముస్లిం వర్గాలు మండిపడుతున్నాయి. శుక్రవారం ప్రార్థనల అనంతరం ఢిల్లీ,ముంబై, యూపీలోని పలు పట్టణాల్లో ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రయాగ్‌రాజ్‌లో నిరసన సందర్భంగా హింస చోటు చేసుకుంది. ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పోలీసులపై నిరసన కారులు రాళ్లు రువ్వారు. దాదాపు ఆరు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘర్షణల్లో పలు వాహనాలు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఆందోళనకారుల దాడిలో ఇద్దరు సీనియర్ అధికారులు సహా డజను మంది పోలీసులు గాయాల పాలయ్యారు.