విశ్వాసం లేని మనుషులకంటే కుక్కను పెంచుకోవటం మేలు అని చాలా మంది భావిస్తారు. ఎంతో మంది కుక్కలను కూడా తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావిస్తూ ప్రేమగా పెంచుకుంటారు. ఈ జీవులు భద్రతకు, విశ్వాసానికి పెట్టింది పేరు. ఇదేకాకుండా కుక్కలకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. అవి వాసన చూసి కొన్నింటిని పట్టేస్తాయి. అందుకే పోలీసులు కూడా ఆధారాల సేకరణ కోసం ప్రత్యేకమైన 'డాగ్ స్కాడ్' ను కలిగి ఉంటారు. ఇదిలా ఉంటే, యూకేలోని క్వీన్స్ యూనివర్శిటీ బెల్ఫాస్ట్ పరిశోధకులు నిర్వహించిన కొత్త అధ్యయనంలో కుక్కలకు సంబంధించిన మరొక ఆసక్తికర విషయం బయటపడింది. అదేంటంటే, మనుషులు ఒత్తిడి ఆందోళనలో ఉన్న విషయాన్ని కుక్కలు అర్థం చేసుకుంటాయట. మనుషుల నుంచి వచ్చే చెమట వాసన, వారి శ్వాస ఆధారంగా వారు ఒత్తిడిలో ఉన్నట్లు గుర్తిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన ఫలితాలు సైంటిఫిక్ జర్నల్ PLOS ONE లో ప్రచురించారు.