ప్రపంచంలోనే తొలిసారిగా నాసా నిర్వహించిన గ్రహ రక్షణ పరీక్ష విజయవంతమైంది. అంతరిక్షం నుండి భూమివైపు దూసుకొచ్చే భారీ గ్రహశకలాల నుంచి మానవాళిని రక్షించేందుకు అంతరిక్ష పరిశోధన సంస్థ NASA తాజాగా DART మిషన్ చేపట్టింది. ప్రయోగంలో భాగంగా నాసా పంపించిన అంతరిక్ష నౌక భూమికి ఏడు మిలియన్ మైళ్ల దూరంలో ఉన్న ఉల్కను ఢీకొట్టింది. అనుకున్న విధంగా లక్ష్యాన్ని ఢీకొట్టి, దాని దారిని మళ్లించడంలో విజయవంతమైంది. డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (DART) ఇంపాక్టర్ ప్లాన్ ప్రకారం సెప్టెంబర్ 27న IST ఉదయం 4.44 గంటలకు స్పేస్ రాక్ డిమోర్ఫోస్‌ను తాకింది. భవిష్యత్తులో ఎప్పుడైనా ఊహించని ఉల్కపాతం ఎదురైతే, ఆ వినాశనాన్ని తప్పించే మార్గం ఉందని ఈ చారిత్రాత్మక ప్రయోగం రుజువు చేసింది.