ధూమపానం చేసే మహిళల సంఖ్య కూడా ఇటీవల పెరిగిపోతుంది. అయితే చాలామంది మహిళలు సిగరెట్ తాగటం మానేస్తున్నారని ఒక తాజా అధ్యయనం వెల్లడించింది. మహిళలు తాము గర్భం దాల్చమన్న విషయం తెలియకముందు రోజుకు ఒక సిగరెట్ చొప్పున తగ్గించారు, గర్భం దాల్చారని తెలిశాక రోజుకు నాలుగు సిగరెట్ల చొప్పున తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం చేస్తున్నారు. మహిళలు ధూమపానం తగ్గించడం విషయంలో గర్భం ఏదైనా ప్రభావం చూపిందా? అన్న కోణంలో ఈ రీసెర్చ్ జరిగింది. సాధారణంగా గర్భధారణ ప్రారంభంలో హ్యూమన్ కోరియోనిక్ గోనడోట్రోపిన్ (hCG) అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి జరిగే సమయంలో వికారం, వాంతులు అవుతుంటాయి. ఈ hCG స్థాయిలు ఎక్కువైనపుడు మహిళల్లో ధూమపానం చేయడం తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అంటే గర్భధారణ హార్మోన్లు పొగత్రాగటం మానేయటంలో పాత్ర వహిస్తున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు.