AP police seize arms : బెంగళూరు కేంద్రంగా కిరాయి హత్యలు, బెదిరింపులకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులు ఆరుగురుని అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ నోట్ల చలామణి కేసులో తీగ లాగితే అక్రమ ఆయుధాలు, మాదకద్రవ్యాలు సరఫరా చేసే కిరాయి హంతక ముఠా డొంక కదిలింది. ముఠా నుంచి 18 ఆయుధాలు, 95 లైవ్ రౌండ్ బుల్లెట్లు, 6 అదనపు మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న బృందాన్ని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి అభినందించారు. అనంతరం ఎస్పీ ఫక్కీరప్పతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. అరెస్టయిన వారిలో నలుగురు కర్ణాటకకు చెందిన వారని.. వారిపై ఆ రాష్ట్రంలో రౌడీషీట్లతోపాటు ఏపీ, కర్ణాటక, మధ్య ప్రదేశ్, గోవాల్లో చాలా కేసులు ఉన్నాయని వివరించారు. ముఠా సభ్యులు వెల్లడించిన వివరాల ఆధారంగా బార్వని జిల్లా ఉమ్మర్తిలోని అక్రమ ఆయుధాల తయారీ కేంద్రంపై దాడులు చేసినట్లు వెల్లడించారు.