Global Investors Summit 2023 Vizag: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ప్రసంగించిన ఆయన... ఇవాళ నీరు, విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ అన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తోందన్నారు. అదే సమయంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. “చాలా కాలంగా సీఎం జగన్.. 6 లేన్ల వైజాగ్ పోర్ట్ హైవే కు సంబంధించి ఒక ముఖ్యమైన డిమాండ్ నా ముందు ఉంచారు. ఈ రహదారి 55 కిలోమీటర్ల మేర ఉంటుంది,. ఖర్చు రూ.6300 కోట్లు అంచనా.” అని గడ్కరీ వెల్లడించారు. సీఎం జగన్ డ్రీమ్ ప్రాజెక్ట్ ను మంజూరు చేస్తున్నట్లు సభా వేదికగా ప్రకటించారు. రాష్ట్ర అభివ్రుద్ధికి తన సహకారాన్ని అందించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు గడ్కరీ.