ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో లక్ష రూపాయలు సరకు విక్రయించి.. కేవలం 7 వేల రూపాయలకే బిల్లు చూపిస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంద్వేశ్వరి ఆరోపించారు. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతున్నా, చర్యలు తీసుకోవడంలో సీఎం జగన్ మీనమేషాలు లెక్కిస్తున్నారని పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నరసాపురంలో పురంధేశ్వరి పర్యటించారు. ప్రభుత్వ దుకాణాల్లో మద్యం తాగి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. అనంతరం ప్రభుత్వ మద్యం దుకాణం దగ్గర మద్యం సీసాలను పగలగొట్టారు. మద్యం దుకాణాన్ని సందర్శించి అమ్మక వివరాలపై ఆరా తీశారు. బిల్లుల అవకతవకలపై పురందేశ్వరి విస్మయం వ్యక్తం చేశారు. ఏపీలో మద్యం మాఫియా చెలరేగిపోతోందని, నకిలీ మద్యం ప్రజలకు ప్రాణాంతకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.