Nara Lokesh Padayatra: లోకేశ్ కు చంద్రబాబు, బాలయ్య ఆశీస్సులు
- Nara Lokesh Yuva Galam: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈనెల 27 నుంచి ఏపీ వ్యాప్తంగా ‘యువగళం’ పాదయాత్రకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళులర్పించారు. అంతకుముందు తొలుత ఇంటి వద్ద లోకేశ్ తన తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరి, అత్తమామలు బాలకృష్ణ, వసుంధర కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆయన సతీమణి నారా బ్రహ్మణి హారతిచ్చారు. ఆ తర్వాత లోకేశ్ ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లారు.లోకేశ్ రాకతో ఎన్టీఆర్ ఘాట్ వద్దకు పెద్ద ఎత్తున తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, నేతలు వచ్చారు. లోకేశ్ ఎన్టీఆర్ ఘాట్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి కడప బయల్దేరారు. ఇక లోకేశ్ పాదయాత్ర చూస్తే… మొత్తం 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు లోకేశ్ నడవనున్నారు. పాదయాత్ర మార్గంలో వివిధ వర్గాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభం కానుంది. రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఇతర అంశాలను ఇందులో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. రాజధాని నిర్మాణం, రైతాంగం, పెట్టుబడులు, ఆర్థికపరిస్థితి, మహిళల సమస్యలు వంటి అంశాలు ఇందులో ఉండనున్నాయి. యువతను పెద్దఎత్తున పాదయాత్రలో భాగస్వామ్యం చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు.మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేయాలనేది టీడీపీ ప్లాన్. ఇందులో భాగంగా ప్రతీ మండలంలో రోడ్ షో.. ప్రతీ నియోజకవర్గంలో బహిరంగ సభకు ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి.