CM Jagan On Modi : మాపై పెద్ద మనసు చూపండి సార్... మోదీ సభలో సీఎం జగన్
- CM Jagan Comments: విశాఖలోని ఏయూ గ్రౌండ్ వేదికగా నిర్వహించిన ప్రధాని మోదీ సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో గానీ మీతో(మోదీ) గానీ మా బంధం రాజకీయాలకు అతీతమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల తప్ప మాకు మరో అజెండా లేదని.. ఉండబోదని స్పష్టం చేశారు. మా రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసేలా పెద్ద మనసు చూపాలని కోరారు. మీరు చేసే మంచి పనులను ఇక్కడి ప్రజలు గుర్తు పెట్టుకుంటారని వ్యాఖ్యానించారు. దాదాపుగా రూ.10,742 కోట్లు ఖర్చయ్యే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నందుకు, ఆశేష జనవాహిని తరపున, రాష్ట్ర ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా శక్తిమేరకు చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం సహాయ సహకారాలు అందించి ఆశీర్వదించాలని కోరారు. ఎనిమిదేళ్ల క్రితం తగిలిన అతిపెద్ద గాయం నుంచి మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇంకా కోలుకోలేదని, మా గాయాలు మానేలా, మా రాష్ట్రం జాతీయ స్రవంతితో పాటు అభివృద్ధి చెందడానికి వీలుగా, ప్రధాని సహృదయంతో విశాల హృదయంతో చేసే ప్రతి సహాయం, మీరు మా రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చే ప్రతి సంస్థ, మీరు మా రాష్ట్రానికి అదనంగా ఇచ్చే ప్రతి రూపాయి, మా రాష్ట్ర పునర్నిర్మాణానికి గొప్పగా ఉపయోగపడుతుందని చెప్పారు.